బ్యాటర్ల సంపూర్ణ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 డబుల్ సెంచరీ అనేది ఎక్కువ దూరం లేదన్న విషయం అర్దమవుతుంది. బ్యాటర్ల ఊచకోత ధాటికి టీ20 డబుల్ ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. అతి త్వరలో ఈ అపురూప ఘట్టాన్ని చూడటం ఖాయమన్న విషయం తేలిపోయినప్పటికీ.. ఎవరు తొలి డబుల్ సాధిస్తారనే విషయంపై మాత్రం ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. జోస్ బట్లర్, రోహిత్ శర్మ సాధిస్తాడని కొందరంటుంటే.. ట్రవిస్ హెడ్, క్లాసెన్‌కు అవకాశం ఉందని మరికొందరంటున్నారు. వీరిద్దరి పేర్లే కాకుండా చాలామంది క్రికెటర్ల పేర్లు తొలి టీ20 డబుల్ రేసులో వినబడుతున్నాయి.
ఈ విషయంపై చాలా మంది తరహాలోనే న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్‌కు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది కాబట్టి టీ20 డబుల్ అతనికి ఈజీ అవుతుందని అన్నాడు.
రోహిత్ ఎలాగూ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడు కాబట్టి ఏ క్షణంలోనైనా అతని బ్యాట్ నుంచి టీ20 డబుల్ జాలు వారే అవకాశం ఉందని తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనే ఈ ఫీట్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2024 ఐపీఎల్‌లో బ్యాటర్ల దూకుడు చూస్తుంటే ఇది ఎంతో దూరం లేదని అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం రెట్టింపైందని.. ఈ సీజన్‌లో నమోదైన జట్టు స్కోర్లే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశాడు. ఇదే సందర్భంగా కేన్ ఎంఎస్ ధోనిని తన ఆల్‌టైమ్ ఉత్తమ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు.
కాగా, టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్‌లో గేల్ పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 (నాటౌట్) పరుగులు చేశాడు. టీ20ల్లో నేటి వరకు ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు చూస్తుంటే గేల్ రికార్డు మూడినట్లు అనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment