
భయపెట్టే బౌలర్లు..
- 400 టెస్టు వికెట్ల మైలురాయిని అందుకున్న స్టెయిన్, అండర్సన్..
- 300 టెస్టు వికెట్ల క్లబ్‌లో మిచెల్ జాన్సన్
క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ హవా పెరిగిపోయిన ఈ రోజుల్లో తమ ఉనికి చాటుకుంటున్న బౌలర్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. వేగంగా దూసుకొచ్చే బంతులతో, తమ దూకుడు స్వభావంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బయపెట్టే పేసర్లు ప్రస్తుతం పది మంది కూడా లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లలో ముందువరుసలో ఉన్నారు డేల్ స్టెయిన్, మిచెల్ జాన్సన్. వీరిద్దరూ ఒకేరోజు తమ కెరీర్లలో మరచిపోలేని మైలురాళ్లను అందుకున్నారు. స్టెయిన్ 400 వికెట్లు, జాన్సన్ 300 వికెట్ల క్లబ్‌లో చేరి తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఆసీస్ వెన్నెముక..
2007లోనే ఆసీస్ తరఫున టెస్టులో అడుగుపెట్టాడు మిచెల్ జాన్సన్. బ్రెట్‌లీ, స్టువర్ట్ క్లార్క్ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నా వేగంతో అందర్నీ ఆకర్షించాడు. సొంతగడ్డపై అయితే చెప్పనక్కర్లేదు. బౌన్సర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించడంలో దిట్ట. 2011 వరకు కెరీర్ బాగానే సాగినా గాయం కారణంగా జట్టుకు దూరమై మళ్లీ పునరాగమనం కోసం కష్టపడ్డాడు. జట్టులో చోటు దొరికినా పాత ఫామ్ దొరకబుచ్చుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరగలేదు. ఆసీస్ పేస్ విభాగానికి నాయకుడిగా ఎదిగాడు. స్టెయిన్‌కు పోటీగా తయారయ్యాడు. యాషెస్ మూడో టెస్టులో గురువారం ఇంగ్లండ్‌పై తన 300వ వికెట్‌ను పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన ఐదో ఆస్ట్రేలియన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కేవలం 62 టెస్టుల్లోనే 300 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఒక చేయి వేశాడు. ఆస్ట్రేలియా జట్లు తరఫున 2000 పరుగులు చేసి, 300 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తొలిస్థానంలో దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ ఉన్నాడు.
నిఖార్సయిన ఫాస్ట్ బౌలర్..
ప్రస్తుత తరంలో అసలు సిసలైన పేస్ బౌలర్ ఎవరని మాజీ ఆటగాళ్లను, ఆడుతున్న ప్లేయర్లను, అభిమానులను సైతం ప్రశ్నిస్తే వచ్చే ఏకైక జవాబు డేల్ స్టెయిన్. దక్షిణాఫ్రికా పేస్ విభాగానికి గత దశాబ్ద కాలంగా వెన్నెముకగా నిలిచిన స్టెయిన్.. బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో 400 వికెట్ల మైలురాయిని దాటాడు. దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ కెరీర్ ముగిసే దశలో జట్టులోకి వచ్చిన స్టెయిన్.. అతని తర్వాత 400 వికెట్లు తీసిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. స్టెయిన్ కంటే ముందే మరో 12 మంది ఆ క్లబ్‌లో చే రినా అతను మాత్రం తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (16,634) ఆ మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ టెస్టుల్లో (80) దాన్ని అందుకున్న బౌలర్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
2004లో ఇంగ్లండ్‌పై సొంతగడ్డపై టెస్టు కెరీర్ మొదలుపెట్టిన స్టెయిన్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ పిచ్‌లపైనే కాకుండా ఉపఖండపు పిచ్‌లపై కూడా బౌలింగ్‌లో అదరగొట్టి అందరిని ఔరా అనిపించాడు. 200కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో స్ట్రైక్ రేట్ ఉత్తమంగా ఉన్నది కూడా స్టెయిన్‌దే (41.5). అతని తర్వాతే దిగ్గజాలు వకార్ యూనిస్ (43.4), మాల్కమ్ మార్షల్ (46.7), అలన్ డొనాల్డ్ (47) ఉన్నారు. స్టెయిన్ ఇప్పటివరకు 79 టెస్టులు ఆడగా 61 మ్యాచ్‌ల్లో సఫారీలు ఓడిపోలేదు.
ముగ్గురి మధ్యే పోటీ..
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో స్టెయిన్ కంటే ముందున్నది ఇంగ్లండ్ స్టార్ అండర్సన్ (413 వికెట్లు) మాత్రమే. అండర్సన్‌కు స్టెయిన్‌కు ఎటువంటి పోలిక లేదు. కేవలం సొంతగడ్డపై తప్ప విదేశాల్లో అండర్సన్ రాణించలేదు. అండర్సన్ ను దాటే అవకాశం 32 ఏళ్ల స్టెయిన్‌కు ఉన్నా అది సులభం కాదు. ఎందుకంటే గత ఏడాదిన్నరగా స్టెయిన్ ఫామ్ అంతంతమాత్రమే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మాతమే సత్తా చాటాడు. 33 ఏళ్ల అండర్సన్ విషయానికొస్తే 2003 నుంచే జట్టులో ఉన్నా 2008 తర్వాతనే స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాతే వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. 33 ఏళ్ల మిచెల్ జాన్సన్ కూడా 2011 తర్వాత చెలరేగుతున్నాడు. అంత కు ముందు అతని సగటు 29.43 ఉండగా స్ట్రైక్ రేట్ 53.5, అదే 2011 తర్వాత సగటు 25.12, స్ట్రైక్ రేట్ 46.3గా నమోదైంది. స్టార్క్ రాకతో అతని ప్రాభవం కాస్త తగ్గింది. ప్రస్తుత యాషెస్‌లో పెద్దగా రాణించలేదు. ఈ ముగ్గురు బౌలర్ల వయసు కూడా ఇంచుమించు సమానమే. గణాంకాలను, ప్రస్తుతం ఫామ్‌ను ఆధారంగా అండర్సన్‌ను దాటడానికి స్టెయిన్‌కు మరేంత కాలం పట్టేలా లేదు.
స్టెయిన్ అండర్సన్ జాన్సన్
100 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 20 29 23
200 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 39 55 49
300 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 60 81 69
400 వికెట్లకు ఆడిన మ్యాచ్‌లు 80 104 -
బౌలింగ్ సగటు 22.4 29.4 27.7
స్ట్రైక్ రేట్ 41.5 57.7 50.6
ఎకానమీ రేట్ 3.24 3.05 3.28
ఉత్తమ గణాంకాలు 7/51 7/43 8/61
ఉత్తమ స్ట్రైక్ రేట్ (ఒక్కో వికెట్‌కు అవసరమైన బంతులు)
ఆటగాడు దేశం స్ట్రైక్ రేట్
డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా 41.5
రిచర్డ్ హ్యాడ్లీ న్యూజిలాండ్ 50.8
గ్లెన్ మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియా 51.9
కర్ట్‌లీ అంబ్రోస్ వెస్టిండీస్ 54.5