హామిల్టన్ హవా
- చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
- సీజన్‌లో రెండో విజయం
- ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ
షాంఘై: ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో రెండో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 39 నిమిషాల 42.008 సెకన్లలో పూర్తి చేశాడు. ‘పోల్ పొజిషన్’తో రేసు మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ ఆద్యంతం ఆధిక్యంలో ఉన్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... మాజీ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ ఎదురైంది.
సెర్గియో పెరెజ్ 11వ స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో ల్యాప్‌లోనే రేసు నుంచి వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో నెగ్గిన హామిల్టన్, మలేసియా గ్రాండ్‌ప్రిలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో మూడుసార్లు చైనా గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెగ్గిన హామిల్టన్‌కు ఈ ఏడాదీ అం తగా పోటీ ఎదురుకాలేదు. తొలి ల్యాప్ నుంచే ఆధిక్యం లోకి వెళ్లిన అతనికి చివరి దశలో సహచరుడు రోస్‌బర్గ్ నుంచి సవాలు ఎదురైంది. అయితే 7 సెకన్ల ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా గమ్యానికి చేరాడు.