మళ్లీ హామిల్టన్‌దే పోల్
* రెండో స్థానంలో రోస్‌బర్గ్
* నేడు స్పానిష్ గ్రాండ్ ప్రి
బార్సిలోనా: ఈ సీజన్ ఫార్ములా వన్‌లో జోరు మీదున్న లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) స్పానిష్ గ్రాండ్ ప్రిలోనూ సత్తా చాటాడు. శనివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో అతను మొదటి స్థానంలో నిలిచాడు. ఈ బ్రిటన్ డ్రైవర్ 1 నిమిషం 25.232 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేస్‌ను అతను ‘పోల్ పొజిషన్’నుంచి ప్రారంభిస్తాడు. ఈ ఏడాది ఐదు అర్హత రేస్‌లలో నాలుగో సారి తొలి స్థానంలో నిలిచిన హామిల్టన్ కెరీర్‌లో ఇది 35వ పోల్ పొజిషన్ కావడం విశేషం. క్వాలిఫయింగ్ రేస్‌లో హామిల్టన్ సహచర మెర్సిడెస్ డ్రైవర్, జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ (1 ని. 25.400 సె.) రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో (1 ని. 26.285 సె.)కు మూడో స్థానం నుంచి రేస్ ప్రారంభిస్తాడు.
టాప్-10లో ‘ ఫోర్స్’కు దక్కని చోటు: ఈ ఏడాది తొలి నాలుగు అర్హత రేస్‌లలోనూ టాప్-10 నిలిచిన ఫోర్స్ ఇండియా స్పానిష్ రేసులో మాత్రం విఫలమైంది. సెకనులో పదో వంతు తేడాతో వెనుబడి ఫోర్స్ డ్రైవర్ హల్కెన్‌బర్గ్ 11వ స్థానంలో నిలవంగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానంతో సరి పెట్టుకున్నాడు.