'టీ కప్'లో ధోనీసేనకు తొలి సవాల్
- రేపటి నుంచి టి-20 ప్రపంచ కప్ ప్రధాన మ్యాచ్లు
- న్యూజిలాండ్తో భారత్ ఆరంభ మ్యాచ్
నాగ్పూర్: టి-20 ప్రపంచ కప్ గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా రికార్డు సృష్టించేందుకు టీమిండియా సన్నద్ధమైంది. ఈ మెగా ఈవెంట్లో ధోనీసేనకు న్యూజిలాండ్ రూపంలో తొలి సవాల్ ఎదురవుతోంది. మంగళవారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. 2007లో జరిగిన టి-20 ప్రపంచ కప్లో ధోనీసేన విజేతగా నిలిచింది. కాగా ఇప్పటి వరకు ఐదు టి-20 ప్రపంచ కప్లు జరగగా, ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదు.
ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇటీవల పొట్టి క్రికెట్లో ధోనీసేన వరుస విజయాలు సాధిస్తూ ఆల్రౌండ్ షోతో అదరగొడుతోంది. అంతేగాక సొంతగడ్డపై ఆడనుండటం, అభిమానుల మద్దతు పుష్కలంగా ఉండటం కలసివచ్చే అంశం. ఇక భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ రాణిస్తున్నారు. ఇక సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, ధోనీ వంటి హిట్లర్లు ఉండనే ఉన్నారు. బౌలింగ్లో ఆశీష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, అశ్విన్, జడేజా కీలకం.
విధ్వంసక బ్యాట్స్మన్ బ్రెండన్ మెకల్లమ్ రిటైరవడం న్యూజిలాండ్ జట్టుకు లోటుగా కనిపిస్తున్నా.. మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో, ఇలియట్, రాస్ టేలర్, కోరీ అండర్సన్ వంటి మేటి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. నాణ్యమైన పేసర్లు జట్టులో ఉన్నారు. ఇటీవల న్యూజిలాండ్ కూడా టి-20 ఫార్మాట్లో మంచి విజయాలు సాధిస్తోంది.
జట్లు:
భారత్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), ధవన్, రోహిత్, కోహ్లీ, రైనా, యువరాజ్, హార్దిక్, జడేజా, అశ్విన్, జస్ప్రీత్, నెహ్రా, హర్భజన్, పవన్ నేగి, రహానె, షమీ
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గుప్టిల్, నిఖోల్స్, రోంచి, రాస్ టేలర్, కొలిన్ మున్రో, మిచెల్ శాంటర్, నాథన్ మెకల్లమ్, ఇలియట్, మెక్క్లెనాఘన్, సౌథీ, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నె, సోధీ, కోరీ అండర్సన్
మ్యాచ్ సమయం: రాత్రి 7:30 గంటలకు