
2014 హాకీ ప్రపంచకప్‌లో 12 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి జట్ల సంఖ్య 16కు పెరిగింది. వచ్చే ఏడాది జరిగే బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 24 నుంచి 32కు పెంచారు. ప్రస్తుతం ఉన్న 32 జట్ల నుంచి 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగమయ్యే దేశాల సంఖ్యను 48కి పెంచాలని ‘ఫిఫా’ ప్రతిపాదించింది. ఇదంతా ఆయా ఆటలకు ప్రాచుర్యం పెంచే ఆలోచన, ‘ప్రపంచం’లో ఎక్కువ మందికి చేరువయ్యేలా, వారు కూడా భాగమయ్యేలా చేసే పద్ధతి.
క్రికెట్‌కు వచ్చేసరికి 2015లో వన్డే వరల్డ్ కప్ 14 జట్లతో జరిగింది. వచ్చే సంవత్సరం ఇంగ్లండ్‌లో జరిగే టోర్నీ 10 దేశాలకు మాతమ్రే పరిమితం. 105 సభ్య దేశాలు ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేరుకే ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న తీరు ఇది. ఇందులోనూ ఎనిమిది జట్లకు మాత్రమే చోటు ఖరారు చేసి, మిగిలిన 2 స్థానాల కోసం మరో పది జట్ల మధ్య క్వాలిఫయింగ్ పేరుతో నిర్వహించిన ప్రహసనం మరొకటి.
ఐసీసీ తమ వెబ్‌సైట్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఆటకు ప్రాచుర్యం కల్పించడం, క్రీడా స్ఫూర్తి గురించి చాలా చెప్పుకుంటోంది. కానీ వారి మాటలకు, చేతలకు పొంతనే లేదు. తమ ‘విలువల’ గురించి వారు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
–ప్రెస్టన్ మామ్‌సెన్, స్కాట్లాండ్ సీనియర్ క్రికెటర్
సాక్షి క్రీడా విభాగం : 1975లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 11 టోర్నీలు జరిగాయి. ప్రతీ సారి కనీసం ఒక్క అసోసియేట్ టీమ్ అయినా టోర్నీలో పాల్గొంది. మొదటిసారి అసోసియేట్ టీమ్ ప్రాతినిధ్యం లేకుండా వరల్డ్ కప్ జరగనుంది. ‘ఏకపక్ష మ్యాచ్‌లు జరుగుతాయి, ఆసక్తి తక్కువ’ పేరుతో ఐసీసీ చిన్న జట్లను మెగా టోర్నీకి దూరంగా ఉంచడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదృష్టవశాత్తూ సుడి తిరగడంతో వెస్టిండీస్ చివరి క్షణంలో క్వాలిఫై అవగలిగింది కానీ నిజంగా విండీస్ ఓడిపోయి దూరమై ఉంటే వరల్డ్ కప్‌కు కళ ఉండేదా! అసలు జట్లను పదికి పరిమితం చేయడంలోనే ఐసీసీ వైఫల్యం కనిపిస్తోంది. జట్ల సంఖ్యను పెంచకపోవడం సరే... 2015 తరహాలో కనీసం 14 టీమ్‌లతోనైనా నిర్వహించడం వారికి ఎందుకు చేత కావడం లేదనేదే అసలు ప్రశ్న. అసలు 10 జట్ల టోర్నీని
ప్రపంచకప్ అనగలమా? అద్భుతంగా ఆడినా...
వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ మాత్రమే అసలు టోర్నీకి అర్హత సాధించినా... క్వాలిఫయింగ్‌లో మిగతా జట్లు కూడా అద్భుతమైన ఆటతీరు కనబర్చాయి. ముఖ్యంగా అఫ్గాన్‌ను ఓడించి, జింబాబ్వేతో మ్యాచ్ ‘టై’ చేసుకొని విండీస్‌ను దాదాపు ఓడించినంత పని చేసిన స్కాట్లాండ్‌కు తుది ఫలితం గుండె పగిలేలా చేసింది. కనీస మ్యాచ్ ఫీజులు లేని, రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లేని దివాళా స్థితిలో జింబాబ్వే ఈ టోర్నీలో పట్టుదలగా ఆడి మంచి విజయాలు సాధించింది. కానీ డక్‌వర్త్ లూయిస్ కారణంగా 3 పరుగులతో ఓడిన ఆ జట్టు అర్హత సాధించలేకపోయింది. వరల్డ్ కప్‌లో కూడా తమను చూసుకోలేని ఇలాంటి స్థితిలో జింబాబ్వే క్రికెట్ మరింత పతనం కావడం ఖాయం. ఎన్నో సార్లు సంచలన ప్రదర్శనతో వరల్డ్ కప్ ఆడే స్థాయి తమకు ఉందని నిరూపించుకున్న ఐర్లాండ్ కూడా త్రుటిలో అవకాశం కోల్పోయింది. టోర్నీని పది జట్లకే పరిమితం చేయకుండా ఉంటే ఈ టీమ్‌లన్నీ విశ్వ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యేవి. బలహీన జట్లు ఉంటే టోర్నీ వన్నె తగ్గుతుందని గుడ్డిగా నమ్ముతున్న ఐసీసీకి... పసికూనలుగా బరిలోకి దిగి వరల్డ్ కప్‌లలో కెన్యా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ సాధించిన సంచలన విజయాల గురించి తెలియదా?
కంగాళీ నిర్వహణ...
పది జట్ల నుంచి రెండింటికి మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉన్నప్పుడు ఆయా టీమ్‌ల కోణంలో క్వాలిఫయింగ్ టోర్నీకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా వారి అవకాశాలను దెబ్బ తీయవచ్చు. కానీ ఐసీసీ మాత్రం ఈ టోర్నీని అథమ స్థాయిలో నిర్వహించింది. నిబంధనలపై వారికే స్పష్టత లేకుండా పోయింది. కొన్ని మ్యాచ్‌లకు వన్డే హోదా ఇచ్చి మరికొన్నింటికి దేశవాళీ మ్యాచ్‌గా గుర్తింపు ఇచ్చింది. లీగ్ దశలో లేని సూపర్ ఓవర్ నిబంధనను అప్పటికప్పుడు సూపర్ సిక్స్‌లో చేర్చి తర్వాతి రోజే దానిని తొలగించింది. జింబాబ్వేలో వర్షాకాలంలో మ్యాచ్‌లు నిర్వహిస్తూ కనీసం సూపర్ సిక్స్‌కు కూడా రిజర్వ్ డే పెట్టకుండా డక్‌వర్త్ లూయిస్‌కే ఫలితాన్ని అప్పగించేసింది. అన్నింటికి మించి ఇంత ప్రాధాన్యత ఉన్న టోర్నీకి కనీసం డీఆర్‌ఎస్ అమలు చేయలేదు. అంపైర్ తప్పుడు ఎల్బీడబ్ల్యూ నిర్ణయంతో స్కాట్లాండ్.. రెండు సార్లు తప్పుడు నోబాల్‌లతో జింబాబ్వే తమ విజయావకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. పెద్ద దేశాలు, ఆదాయ పంపిణీలే తప్ప చిన్న జట్ల భవిష్యత్తు, ఆయా దేశాల్లో క్రికెట్ ఎదుగుదల గురించి ఏమాత్రం పట్టింపు లేని ఐసీసీ లెక్కలేనితనమే ఈ టోర్నీ నిర్వహణలో కనిపించింది. ఎప్పుడో మళ్లీ వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ దేశాల్లో క్రికెట్ మనగలుగుతుందా!
Comments
Please login to add a commentAdd a comment