నేనేం మాట్లాడినా వినిపిస్తోంది!
మైక్రోఫోన్‌లపై ధోని అసంతృప్తి
మిర్పూర్: మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలో ఏర్పాటు చేసే మైక్రోఫోన్‌లపై భారత కెప్టెన్ ధోని తన అసంతృప్తిని ప్రదర్శించాడు. తాను సహచరులతో పంచుకునే వ్యూహాలు అందరికీ తెలిసిపోతున్నాయని అతను అన్నాడు. ‘జట్టులోని ఒక ఆటగాడు మరో ఆటగాడితో మాట్లాడే సమయంలో మైక్రోఫోన్‌లు పని చేయకుండా చూస్తామని మ్యాచ్ రిఫరీలు చెబుతున్నారు. కానీ అదేంటో నేను ఏం మాట్లాడినా అవి పట్టేస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా కనిపిస్తోంది.
ఎవరైనా ఆటగాడు అనకూడని మాట అంటే మైక్ పని చేయడం లేదు కదా సమస్య లేదు అనిపిస్తుంది. కానీ నేను మాట్లాడినప్పుడు మాత్రం మైక్ ఆన్‌లోనే ఉంటోంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం కోహ్లిలో ఉందని, అయితే అందరిలోకి అతనే గొప్ప అంటూ పోలికలు తేవడం తనకిష్టముండదని కెప్టెన్ చెప్పాడు. వరల్డ్ టి20 కోసం భారీ షాట్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలాంటి పిచ్ తగినది కాదని పాక్‌తో మ్యాచ్ అనంతరం మహి అభిప్రాయపడ్డాడు.
రోహిత్ శర్మకు పరీక్షలు...
ఆమిర్ బౌలింగ్‌లో స్వల్పంగా గాయపడిన రోహిత్ శర్మకు ముందు జాగ్రత్తగా ఎక్స్‌రే తీశారు. మ్యాచ్ తొలి బంతి నేరుగా రోహిత్ కాలి బొటనవేలిని తాకింది. శ్రీలంకతో మంగళవారం జరిగే మ్యాచ్ సమయానికే అతని గాయంపై స్పష్టత రావచ్చు.