లార్డ్స్ మైదానం (ఫైల్ ఫొటో)
దుబాయ్ : ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌లు ఎంపికయ్యారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్‌లోని పలు స్టేడియాలు నేలమట్టమవగా... వాటిని పునర్మించేందు చారిటీ మ్యాచ్ నిర్వహించి విరాళాలు సేకరించాలని ఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ లార్డ్స్ వేదికగా మే 31న వెస్టిండీస్‌తో ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడుతుంది.
ఈ ప్రపంచ ఎలెవన్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిదీ, తిసారా పెరీరా(శ్రీలంక), షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ తాజాగా భారత్ నుంచి పాండ్యా, కార్తీక్‌లకు అవకాశం కల్పించింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో గతకొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై కార్తీక్ కళ్లుచెదిరే విజయాన్నందించారు. ఇప్పటికి తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ త్వరలోనే మిగతా ఆటగాళ్లను ఎంపికచేయనుంది. ఇక ప్రపంచ ఎలెవన్ ఢీకొనబోతున్న వెస్టిండీస్ జట్టును ఆదేశ బోర్డు ప్రకటించింది. కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా సామ్యూల్ బద్రీ, క్రిస్‌గేల్‌లతో కూడిన 13 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది.
వరల్డ్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడంపై ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడల్లా క్రికెట్ కుటుంబం మద్దతుగా నిలుస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్ల మధ్య జరిగే ఈ టీ20 మ్యాచ్ ప్రేక్షకులను రంజింప చేయనుంద’ని మోర్గాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment