
గట్టెక్కిన జొకోవిచ్
ఆస్ట్రేలియా ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్ కు చేరాడు.
తొలి మూడు రౌండ్‌లలో అలవోకగా నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఫ్రాన్స్ ఆటగాడు గైల్స్ సిమోన్‌తో జరిగిన ఐదు సెట్‌ల పోరాటంలో ఈ సెర్బియా స్టార్ గట్టెక్కి ఊపిరి పీల్చు కున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా వరుసగా 27వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
మెల్‌బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-7 (1/7), 6-4, 4-6, 6-3తో 14వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై శ్రమించి గెలిచాడు. 4 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు సిమోన్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. అయితే తన కెరీర్‌లో ఐదు సెట్‌లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో 28 సార్లు నెగ్గి, ఐదు సార్లు ఓడిపోయిన జొకోవిచ్ తుదకు అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కాడు.
రికార్డుస్థాయిలో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశిస్తోన్న జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు. తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఏకంగా 100 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను 25 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఈ నంబర్‌వన్ ప్లేయర్ కేవలం ఆరుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు సిమోన్ కూడా కీలకదశలో తడబాటుకులోనై సంచలనం సృష్టించే అవకాశాన్ని వదులుకున్నాడు.
జొకోవిచ్ సర్వీస్‌ను 18 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా సిమోన్ నాలుగుసార్లు మా త్రమే సఫలమయ్యాడు. 68 అనవసర తప్పిదాలు చేసిన సిమోన్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో సిమోన్ సర్వీస్‌ను నాలుగో గేమ్‌లో, ఆరో గేమ్‌లో బ్రేక్ చేసిన జొకోవిచ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ గెలుపుతో జొకోవిచ్ తన కెరీర్‌లో వరుసగా 27వసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరినట్లయింది.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వరుసగా అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరిన రికార్డు ఫెడరర్ (36 సార్లు) పేరిట ఉండగా... ఈ జాబితాలో జిమ్మీ కానర్స్, జొకోవిచ్ (27 సార్లు చొప్పున) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కీ నిషికోరి (జపాన్)తో జొకోవిచ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిషికోరి 6-4, 6-2, 6-4తో తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)పై గెలిచాడు.
శ్రమించిన బెర్డిచ్
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 6-1, 6-4తో 15వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై అలవోకగా గెలుపొందగా... ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 4-6, 6-4, 6-3, 1-6, 6-3తో 24వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై కష్టపడి విజయం సాధించాడు. గాఫిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో ఆండ్రీ అగస్సీ (2005లో; 34 ఏళ్ల 276 రోజులు) తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరిన రెండో పెద్ద వయస్కుడిగా ఫెడరర్ (34 ఏళ్ల 176 రోజులు) గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బెర్డిచ్‌తో ఫెడరర్ తలపడతాడు.
క్వార్టర్స్‌లో సెరెనాతో షరపోవా ‘ఢీ’
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), నిరుటి రన్నరప్ మరియా షరపోవా (రష్యా) ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-2, 6-1తో గస్పార్యాన్ (రష్యా)పై నెగ్గగా... ఐదో సీడ్ షరపోవా 7-5, 6-5తో 12వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-7 (6/8), 6-1, 7-5తో అనాలెనా ఫ్రీడ్‌సమ్ (జర్మనీ)పై, పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 0-6, 6-3, 6-2తో గావ్రిలోవా (ఆస్ట్రేలియా)పై గెలిచారు.
బోపన్న జంట ఓటమి
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 4-6, 3-6తో 14వ సీడ్ ట్రీట్ హువె (ఫిలిప్పీన్స్)-మాక్స్ మిర్నీ (బెలారస్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-3, 7-5తో పావ్లీచెంకోవా (రష్యా)-ఇంగ్లోట్ (బ్రిటన్) ద్వయంపై... రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట 7-5, 6-1తో కింబర్లీ బిరెల్-మిల్‌మాన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి.