జొకోవిచ్ కొత్త చరిత్ర | Djokovic new history | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ కొత్త చరిత్ర

Published Thu, Jun 2 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

జొకోవిచ్ కొత్త చరిత్ర

జొకోవిచ్ కొత్త చరిత్ర

10 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు
ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోకి
వీనస్ ఇంటికి... సెరెనా ముందుకు

 
పారిస్: కెరీర్ గ్రాండ్‌స్లామ్‌పై గురి పెట్టిన సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లడం ద్వారా ఈ నంబర్‌వన్ ప్లేయర్ మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో 10 కోట్ల డాలర్ల (రూ. 674 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. 9 కోట్ల 96 లక్షల 73 వేల 404 డాలర్ల ప్రైజ్‌మనీతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడంతో అతని ఖాతాలో అదనంగా 3 లక్షల 27 వేల 471 డాలర్లు జమయ్యాయి. దాంతో జొకోవిచ్ కెరీర్ ప్రైజ్‌మనీ 10 కోట్ల 875 డాలర్లకు చేరింది. ఓవరాల్ కెరీర్ ప్రైజ్‌మనీ జాబితాలో ఫెడరర్ (స్విట్జర్లాండ్-9 కోట్ల 80 లక్షల 11 వేల 727 డాలర్లు), రాఫెల్ నాదల్ (స్పెయిన్-7 కోట్ల 82 లక్షల 23 వేల 403 డాలర్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.


బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 3-6, 6-4, 6-1, 7-5తో 14వ సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. వర్షం కారణంగా మంగళవారం మూడో సెట్‌లో నిలిచిపోయిన ఈ మ్యాచ్ బుధవారం కొనసాగింది. జొకోవిచ్ మూడు, నాలుగు సెట్‌లలో గెలిచి వరుసగా 28వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మిగతా ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బెర్డిచ్ 6-3, 7-5, 6-3తో 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై, 12వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 4-6, 6-2, 6-2, 6-3తో గుల్బిస్ (లాత్వియా)పై, 13వ సీడ్  థీమ్ (ఆస్ట్రియా) 6-2, 6-7 (2/7), 6-1, 6-4తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై గెలిచారు.


 సెమీస్‌లో వావ్రింకా: మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా 6-2, 6-1, 7-6 (9/7)తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై గెలిచాడు.

బాసిన్‌స్కీ జోరు: మహిళల సింగిల్స్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ (అమెరికా)లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టాప్ సీడ్ సెరెనా 6-1, 6-1తో 18వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)ను చిత్తుగా ఓడించగా... ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-2, 6-4తో తొమ్మిదో సీడ్ వీనస్‌పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్) 7-6 (7/4), 6-3తో 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, యూలియా పుతింత్‌సెవా (కజకిస్తాన్) 7-5, 7-5తో 12వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై సంచలన విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరారు.


మిక్స్‌డ్’ క్వార్టర్స్‌లో సానియా జంట
మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 6-7 (6/8), 6-4, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలీజా కార్నెట్-ఐసెరిక్ (ఫ్రాన్స్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న (భారత్) -మెర్జియా (రుమేనియా)... పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) జంటలకు క్వార్టర్ ఫైనల్లో పరాజయాలు ఎదురయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement