
బీసీసీఐ ట్రైనింగ్ క్యాంప్‌లో విజయ్ శంకర్
చెన్నై:తనను టీమిండియా రెగ్యులర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోల్చడంపై తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ స్పందించాడు. త్వరలో శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనే జట్టులో హార్దిక్ స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. దాంతో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం విజయ్ శంకర్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మాట‍్లాడిన విజయ్.. ' నాకు ఎవరితోనూ పోలిక వద్దే వద్దు. నన్ను వేరే వాళ్లతో పోల్చడాన్ని నేను కోరుకోవడం లేదు. నాకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యం. పోలికకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వను. మనల్ని ఎవరితోనైనా పోల్చితే గ్రౌండ్‌లో ఆడే సమయంలో భారీ అంచనాలు ఏర్పడతాయి.
మనం కామ్‌గా ఉండి మాత్రమే ఏమిటనేది నిరూపించుకోవాలి. ప్రతీ క్రికెటర్ ఒక ప్రత్యేకత చూపించాలనే తాపత్రాయపడతారు. ఒక క్రికెటర్‌గా మేము కూడా ప్రతీదాన్ని పరిశీలించుకుంటాం. ప్రతీ ఒక్కరి నుంచి ఏదొకటి నేర్చుకుని ముందుగా సాగుతాం. ఇక్కడ పోలిక అనేది ఉండదు' అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. మార్చి 6వ తేదీ నుంచి శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్‌లో భాగంగా ఇటీవల భారత క్రికెట్ జట్టు ప్రకటించిన 15 మంది సభ్యుల బృందంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ చోటు దక్కించుకున్నాడు.