విరాట్ను స్లెడ్జ్ చేస్తే.. ఇక అంతే!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని రెచ్చగొట్టి వికెట్ సాధించాలనుకునే ఆస్ట్రేలియా ప్రణాళికతో ఆ దేశ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ విభేదించాడు. భారత్ పర్యటనలో విరాట్ ను స్లెడ్జ్ చేసి ఏదో సాధించాలనుకుంటున్న తమ జట్టు ఆ ప్రయత్నాన్ని మానుకుంటే మంచిదని హితవు పలికాడు. ఆటలో దూకుడుకు మారుపేరైన విరాట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆసీస్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నాడు. గత డిసెంబర్లో ఒక ఇంటర్య్వూలో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. తమ జట్టు సభ్యులు కోహ్లి దూకుడును చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని రెచ్చగొట్టేందుకు కూడా వెనుకాడమన్నాడు. అయితే దీనిపై తాజాగా స్పందించిన హస్సీ.. ఆ ప్రయత్నాన్ని ఆసీస్ మానుకోవం మంచిదని సూచించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జ్ చేస్తూ లబ్ది పొందడం జట్టు ప్రణాళికలో భాగమే అయినప్పటికీ, విరాట్ కోహ్లి దగ్గర మాత్రం ఆ ఆటలు సాగవనే విషయం స్మిత్ సేన గుర్తుంచుకుని ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వస్తాయన్నాడు.
'త్వరలో భారత్ తో తలపడబోయే టెస్టు సిరీస్ లో విరాట్ను రెచ్చగొట్టే యత్నం చేయొద్దు. అతను నిజమైన హీరో. పోరాడే తత్వం, పోటీని ప్రేమించే తత్వం కోహ్లికున్న లక్షణాలు. ఎంతటి క్లిష్ట సమయంలోనైనా కోహ్లి దూకుడును కొనసాగించడానికే ఇష్టపడతాడు. అటు వంటి ఆటగాడ్ని స్లెడ్జ్ చేస్తే ఇంకా రెచ్చిపోతాడు. దాంతో ఆసీస్కు నష్టమే జరుగుతుంది. కోహ్లిని రెచ్చగొట్టాలనే స్మిత్ సేన ప్రణాళిక మంచిది కాదు.. నేనైతే అతన్ని రెచ్చగొట్టే యత్నం చేయను. భారత్ తో జరగబోయే సిరీస్లో మైండ్ గేమ్ ను ఆసీస్ వదిలిపెట్టి ఆటలో ప్రణాళికలపై దృష్టి పెడితేనే మంచిది' అని హస్సీ అభిప్రాయపడ్డాడు.