డు ప్లెసిస్కు ఊరట
అడిలైడ్:బాల్ టాంపరింగ్ వివాదంలో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డు ప్లెసిస్కు ఊరట లభించింది. బాల్ టాంపరింగ్ కు డుప్లెసిస్ పాల్పడినట్లు వీడియో ఫుటేజ్లో తేలినా, అతనికి మొత్తం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. అదే క్రమంలో అడిలైడ్లో జరిగే తదుపరి టెస్టులో డు ప్లెసిస్ యథావిధిగా ఆడేందుకు క్లియరెన్స్ ఇచ్చింది.
డు ప్లెసిస్ తన లాలాజలంతో బంతిని రుద్దుడమే కాకుండా, నోటిలో ఉన్న మింట్ను కూడా ఉపయోగించినట్లు ఐసీసీ పేర్కొంది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లో 2.2.9 నియమావళి ఉల్లంఘన కిందకు వచ్చినా, అతనికి హెచ్చరికతో కూడిన జరిమానాతో సరిపెట్టినట్లు రిచర్డ్సన్ పేర్కొన్నారు. ఈ రకమైన చర్యలతో బంతి యొక్క స్థితి మారుతుందన్నారు. డు ప్లెసిస్పై చర్యలు తీసుకునే క్రమంలో ఫీల్డ్ అంపైర్ల సాక్ష్యం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫీల్డ్ అంపైర్లు వెంటనే అప్రమత్తమై డు ప్లెసిస్ చర్యను నివారించినట్లు తమకు తెలియజేశారని రిచర్డ్సన్ తెలిపారు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా డు ప్లెసిస్ నోటితో బంతి కొరకడంతో వివాదం ఏర్పడింది. అయితే తాను కావాలని ఏ తప్పు చేయలేదని డు ప్లెసిస్ తన వాదనను వినిపించాడు. కాగా, అది కావాలని చేసిన లేక వేరే విధంగా చేసినా ఐసీసీ కోడ్ నియమావళిని డు ప్లెసిస్ ఉల్లఘించాడు. దాంతో అతనిపై మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందని తొలుత భావించినా, చివరకు ఐసీసీ అతనికి భారీ జరిమానాతో సరిపెట్టింది.