స్టోక్స్, ఆర్చర్
‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ గెలవలేం’ అని తమ టీమ్ నినాదంగా మార్చుకున్న జట్టు మొదటి అడుగును బ్రహ్మాండంగా వేసింది. అద్భుతమైన ఆట, సొంతగడ్డపై టోర్నీ, ఎన్నో అనుకూలతలతో, భారీ అంచనాలతో ప్రపంచ కప్ బరిలో దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో వాటిని అందుకుంది. అన్ని రంగాల్లో సమష్టిగా చెలరేగి 2019 ప్రపంచకప్‌నకు ఘనారంభం అందించింది. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు... ఆ తర్వాత పదునైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్ కలగలిసి దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈసారి ఫేవరెట్ కాదు కాబట్టి మాపై ఒత్తిడి లేదంటూ బరిలోకి దిగిన సఫారీలు అన్ని రంగాల్లో విఫలమైన భారీ ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెన్ స్టోక్స్, భీకరమైన బంతులతో ప్రత్యర్థి పని పట్టిన పేసర్ జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ హీరోలుగా నిలిచారు.
లండన్: పన్నెండో ప్రపంచ కప్ తొలి మ్యాచ్ ఏకపక్ష ఫలితాన్ని అందించింది. గురువారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (79 బంతుల్లో 89; 9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (60 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్ (53 బంతుల్లో 54; 8 ఫోర్లు), జో రూట్ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ స్కోరులో కీలక పాత్ర పోషించారు.
సఫారీ బౌలర్లలో ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టగా, తాహిర్, రబడ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. క్వింటన్ డి కాక్ (74 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డసెన్ (61 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఆర్చర్ 27 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా... స్టోక్స్, ప్లంకెట్ చెరో 2 వికెట్లు తీశారు. సోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నాలుగు అర్ధ సెంచరీలు...
గత కొంత కాలంగా అద్భుతమైన ఆరంభాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్న ఇంగ్లండ్‌కు అనూహ్యంగా షాక్ తగిలింది. ప్రధాన పేసర్లను కాదని స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో తొలి ఓవర్ వేయించిన డు ప్లెసిస్ వ్యూహం ఫలించింది ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో (0)ను ఇన్నింగ్స్ రెండో బంతికే తాహిర్ ఔట్ చేశాడు. అయితే జేసన్ రాయ్, రూట్ కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో వీరు బ్యాటింగ్ చేశారు. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. అనంతరం ఒకే ఓవర్లో రాయ్, రూట్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
రాయ్‌కు 51 బంతులు పట్టగా, రూట్ 56 బంతులు తీసుకున్నాడు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపించి దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా ఫెలుక్‌వాయో వేసిన షార్ట్ బంతిని ఆడబోయిన రాయ్ మిడాఫ్‌లో ప్లెసిస్‌కు క్యాచ్ ఇవ్వగా... రబడ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో డుమినికి రూట్ క్యాచ్ ఇచ్చాడు. రాయ్, రూట్ రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో సెంచరీ భాగస్వామ్యం ఇంగ్లండ్ కోలుకునేలా చేసింది. ఈసారి కెప్టెన్ మోర్గాన్, స్టోక్స్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఇన్‌గిడి ఓవర్లో మోర్గాన్ వరుసగా రెండు సిక్సర్లు బాది దూకుడు ప్రదర్శించాడు.
ఈ క్రమంలో వన్డేల్లో 7 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అనంతరం 50 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. మరోవైపు ప్రిటోరియస్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన స్టోక్స్ 45 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నాలుగో వికెట్‌కు స్టోక్స్‌తో కలిసి 106 పరుగులు జత చేసిన తర్వాత మార్క్‌రమ్ పట్టిన చక్కటి క్యాచ్‌తో మోర్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ దశలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు సఫలమయ్యారు. ఇన్‌గిడి వేసిన 49వ ఓవర్లో రివర్స్ పుల్‌కు ప్రయత్నించిన స్టోక్స్...ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు.
రాణించిన డి కాక్, డసెన్...
ఇన్నింగ్స్ ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత కొంత వరకు డసెన్ ... వీరిద్దరు రాణించడం మినహా ఏ దశలో కూడా దక్షిణాఫ్రికా విజయం దిశగా వెళుతున్నట్లు కనిపించలేదు. ముందు గా ఆర్చర్ తన రెండో ఓవర్లో 144.8 కిలోమీటర్ల వేగంతో విసిరిన బౌన్సర్ తలకు తగిలి ఆమ్లా రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా... వరుస ఓవర్లలో మార్క్‌రమ్ (11), కెప్టెన్ డు ప్లెసిస్ (5)లను ఔట్ చేసి ఆర్చర్ మళ్లీ దెబ్బ తీశాడు. ఈ దశలో డి కాక్, డసెన్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. 6 పరుగుల వద్ద డసెన్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ బట్లర్ వదిలేశాడు.
58 బంతుల్లో డి కాక్ అర్ధసెంచరీ పూర్తయింది. ప్లంకెట్ ఓవర్లో డి కాక్ ఫోర్, సిక్స్ కొట్టగా... అలీ వేసిన తర్వాతి ఓవర్లో డసెన్ 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో జోరు పెరిగింది. నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించాక డి కాక్‌ను ఔట్ చేసి ప్లంకెట్ ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత సఫారీల పతనం మొదలైంది. డసెన్‌ను ఆర్చర్ ఔట్ చేయడం... కోలుకొని తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన ఆమ్లా (13) కూడా చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది.
తాహిర్‌తో బౌలింగ్ షురూ...
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. మ్యాచ్ తొలి ఓవర్‌ను తాహిర్ బౌల్ చేశాడు. తద్వారా ఒక ప్రపంచ కప్ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన మొదటి స్పిన్నర్‌గా అతను గుర్తింపు పొందాడు. 1992 ప్రపంచ కప్‌లో దీపక్ పటేల్ (న్యూజిలాండ్) కొత్త బంతితో బౌలింగ్ చేసినా...అతను రెండో ఓవర్‌తో తన బౌలింగ్ మొదలు పెట్టాడు. మరోవైపు 40 ఏళ్ల 64 రోజుల వయస్సున్న తాహిర్...దక్షిణాఫ్రికా తరఫున ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెలుక్‌వాయో 54; బెయిర్‌స్టో (సి) డి కాక్ (బి) తాహిర్ 0; రూట్ (సి) డుమిని (బి) రబడ 51; మోర్గాన్ (సి) మార్క్‌రమ్ (బి) తాహిర్ 57; స్టోక్స్ (సి) ఆమ్లా (బి) ఇన్‌గిడి 89; బట్లర్ (బి) ఇన్‌గిడి 18; అలీ (సి) డుప్లెసిస్ (బి) ఇన్‌గిడి 3; వోక్స్ (సి) డుప్లెసిస్ (బి) రబడ 13; ప్లంకెట్ (నాటౌట్) 9; ఆర్చర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 311.
వికెట్ల పతనం: 1–1, 2–107, 3–111, 4–217, 5–247, 6–260, 7–285, 8–300.
బౌలింగ్: తాహిర్ 10–0–61–2; ఇన్‌గిడి 10–0–66–3; రబడ 10–0–66–2; ప్రిటోరియస్ 7–0–42–0; ఫెలుక్‌వాయో 8–0–44–1; డుమిని 2–0–14–0; మార్క్‌రమ్ 3–0–0–16–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 68; ఆమ్లా (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 13; మార్క్‌రమ్ (సి) రూట్ (బి) ఆర్చర్ 11; డుప్లెసిస్ (సి) అలీ (బి) ఆర్చర్ 5; వాన్‌డర్ డసెన్ (సి) అలీ (బి) ఆర్చర్ 50; డుమిని (సి) స్టోక్స్ (బి) అలీ 8; ప్రిటోరియస్ (రనౌట్) 1; ఫెలుక్‌వాయో (సి) స్టోక్స్ (బి) రషీద్ 24; రబడ (సి) ప్లంకెట్ (బి) స్టోక్స్ 11; ఇన్‌గిడి (నాటౌట్) 6; తాహిర్ (సి) రూట్ (బి) స్టోక్స్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (39.5 ఓవర్లలో ఆలౌట్) 207.
వికెట్ల పతనం: 1–36; 2–44; 3–129; 4–142; 5–144; 6–167; 7–180; 8–180; 9–207; 10–207.
బౌలింగ్: వోక్స్ 5–0–24–0; ఆర్చర్ 7–1–27–3; రషీద్ 8–0–35–1; అలీ 10–0–63–1; ప్లంకెట్ 7–0–37–2; స్టోక్స్ 2.5–0–12–2.
స్టోక్స్,
Comments
Please login to add a commentAdd a comment