కొలంబో: ఐదున్నర దశాబ్దాల తర్వాత ఇంగ్లండ్ చరిత్రకెక్కే విజయాన్ని సాధించింది. ఆఖరి టెస్టులోనూ ఆతిథ్య శ్రీలంకపై ఇంగ్లండ్ జయభేరి మోగించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం చివరి టెస్టులో ఇంగ్లండ్ 42 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు నాలుగో రోజు 53/4 స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు జాక్ లీచ్ (4/72), మొయిన్ అలీ (4/92)లు లంక బ్యాట్స్‌మెన్‌ను చుట్టేశారు.
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండీస్ (86; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రోషన్ సిల్వా (65; 4 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 102 పరుగులు జోడించినప్పటికీ జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో లంక 226 పరుగులకే తొమ్మిదో వికెట్‌ను కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ దశలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పుష్పకుమార (40 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఇంగ్లండ్ శిబిరాన్ని కాసేపు వణికించాడు. అయితే మూడో సెషన్ మొదలైన నాలుగో బంతికే కెప్టెన్ లక్మల్ (11)ను లీచ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చడంతో లంక ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద ముగిసింది.
మొత్తానికి ఇంగ్లండ్‌కు లంకలో చిరస్మరణీయ విజయం దక్కింది. 55 ఏళ్ల తర్వాత 3 అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనతను జో రూట్ సేన సొంతం చేసుకుంది. గతంలో 1963లో టెడ్ డెక్స్‌టర్ సారథ్యంలో ఇంగ్లండ్ 3–0తో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసింది. మరోవైపు శ్రీలంక తమ సొంతగడ్డపై 3–0తో వైట్‌వాష్ కావడం ఇది మూడోసారి. 2004లో ఆస్ట్రేలియా చేతిలో, గతేడాది భారత్ చేతిలోనూ క్లీన్‌స్వీప్ అయింది.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్– 336 ఆలౌట్;
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్–240 ఆలౌట్;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్–230 ఆలౌట్;
శ్రీలంక రెండో ఇన్నింగ్స్–284 ఆలౌట్(కుశాల్ మెండిస్ 86, మొయిన్ అలీ 4/92, జాక్ లీచ్ 4/72).
Comments
Please login to add a commentAdd a comment