తడబడిన ఇంగ్లండ్
చెస్టర్ లీ స్ట్రీట్: ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తడబడింది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి రోజు తక్కువ స్కోరుకే పరిమితమైంది. కుక్ (51), ట్రాట్ (49) ఓ మోస్తరుగా రాణించడంతో ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 9 వికెట్లకు 238 పరుగులు చేసింది. బ్రెస్నన్ (12), అండర్సన్ (16) క్రీజులో ఉన్నారు.
రివర్‌సైడ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. రూట్ (16) తొందరగా అవుట్‌కాగా... కుక్, ట్రాట్ నిలకడగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆసీస్ స్పిన్నర్ లియోన్ (4/42) తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. కుదురుగా ఆడుతున్న ట్రాట్‌తో పాటు మిడిలార్డర్‌లో పీటర్సన్ (26), బెల్ (6), బెయిర్‌స్టో (14)లను వరుస విరామాల్లో అవుట్ చేసి షాకిచ్చాడు.
దీంతో ఇంగ్లండ్155 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లోయర్ ఆర్డర్‌లో ప్రయర్ (17), బ్రాడ్ (3), స్వాన్ (13) కూడా విఫలం కావడంతో కుక్‌సేన ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. బెయిర్‌స్టో, ప్రయర్‌లు ఆరో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. చివర్లో అండర్సన్, బ్రెస్నన్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 24 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ ఆలౌట్ కాకుండా రోజును ముగించింది. లియోన్ 4, హారిస్ 2, బర్డ్, వాట్సన్, సిడిల్ తలా ఓ వికెట్ తీశారు.