మాకు యువరాజే కావాలి !! | Fans Want Yuvraj Singh To In Chennai Super Kings | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 8:53 AM | Last Updated on Sat, Dec 15 2018 5:38 PM

Fans Want Yuvraj Singh To In Chennai Super Kings - Sakshi

ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌ (ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: భారత క్యాష్‌ రిచ్‌లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2019 సీజన్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఈ నెల 18న నిర్వహించనున్న వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. అయితే గ‌త సీజ‌న్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువ‌రాజ్‌సింగ్‌ను అతని పేలవప్రదర్శన కారణంగా ఆ జట్టు వదులుకుంది. దీంతో ఈ సీజన్‌కు యూవీ కనీస ధరను ఒక కోటిగా నిర్ణయించారు. ఈ క్రమంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు యువరాజ్‌ను తీసుకోవాలని ఆ ప్రాంచైజీని పట్టుబడుతున్నారు.

సదరు ఫ్రాంచైజీ.. ‘ఈ సమ్మర్‌లో మనజట్టులో కొత్తగా ఎవరిని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి’ అని అధికారిక ట్వీటర్‌ పేజీలో ఓటింగ్‌ నిర్వహించింది. దీంతో తమకు యువరాజే కావాలంటూ చైన్నై అభిమానులు తమ ఓట్లతో పోటెత్తారు. యూవీని తీసుకోవాలని.. మళ్లీ యువరాజ్‌-ధోని కాంబో చూడముచ్చటగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక నిలకడలేమి ఆటతో చాలా రోజులుగా భారత జట్టుకు దూరమైన యువరాజ్‌.. గత సీజన్‌ ఐపీఎల్‌లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయినా చెన్నై అభిమానులు మాత్రం యూవీయే కావాలంటూ పట్టుబడుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 29న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది.

ఇక 18న జరిగే వేలం నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్‌ ఫించ్‌, మ్యాక్స్‌వెల్‌లు స్వయంగా తప్పుకున్నారు. 2019 ప్రపంచకప్‌కు సన్నాహకంలో భాగంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రెండు కోట్ల కనీస ధర జాబితాలో బ్రెండన్‌ మెకల్లమ్, వోక్స్, లసిత్‌ మలింగ, షాన్‌ మార్ష్‌, కొలిన్‌ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, స్యామ్‌ కరన్, డార్సీ షార్ట్‌లున్నారు. విశేషమేమంటే, గతేడాది రూ.11.5 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతమై అత్యధిక ధర పలికిన భారత క్రికెటర్‌గా నిలిచిన పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌... ఈసారి రూ.కోటిన్నరకే వేలానికి వచ్చాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement