రైతు బిడ్డ ఎలా కోటీశ్వరుడయ్యాడు.? | Farmer Son Became a kabaddi Crorepati | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 11 2018 1:07 PM | Last Updated on Mon, Jun 11 2018 5:03 PM

Farmer Son Became a kabaddi Crorepati - Sakshi

మోను గోయట్‌ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ : అనమాక క్రికెటర్లను ఐపీఎల్‌ ప్రపంచానికి పరిచయం చేస్తే.. కబడ్డీ ఆటగాళ్లను ప్రో కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) కోటీశ్వరులను చేస్తోంది. భారత దేశ ప్రాంతీయ క్రీడ అయిన కబడ్డీ ప్రస్తుతం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.  భారత్‌లో ఐపీఎల్‌ తర్వాత అంత ఆదరణ పొందిన లీగ్‌గా ఇప్పటికే పీకేఎల్‌ గుర్తింపు పొందింది. ఐపీఎల్‌ తరహాలో దేశీయ, విదేశీ ఆటగాళ్లతో ప్రారంభమైన పీకేఎల్‌ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరోసీజన్‌కు సిద్దమైంది. గత సీజన్‌ వరకు లక్షల్లో పలికిన ఆటగాళ్లు ఈసీజన్‌లో ఏకంగా కోట్లలో పలికారు. ఇలా ఓ రైతు బిడ్డ.. మోను గోయట్‌ ఇటీవల జరిగిన వేలంలో కోటిన్నర పలికి వార్తాల్లో నిలిచాడు. హర్యానా హిస్సార్‌ జిల్లాలోని హన్సీ అనే మారుమూల గ్రామానికి చెందిన మోను గోయట్‌ ఈ సీజన్‌ వేలంలో అధిక ధర పలికి చరిత్ర సృష్టించాడు. గతేడాది అత్యధికంగా పలికిన నితిన్‌ తోమర్‌ 96 లక్షల కన్నా ఇది 60 శాతం ఎక్కువ కాగా.. ఐపీఎల్‌లో విదేశీ స్టార్‌ ఆటగాళ్లు జాసన్‌ రాయ్‌, టీమ్‌ సౌథీ, సామ్‌ బిల్లింగ్స్‌లు పలికిన ధరల కన్నా కూడా ఎక్కువే.

మూడు ఫ్రాంచైజీల పోటీ..
స్టార్‌ రైడర్‌ అయిన మోను గోయట్‌ కోసం మూడు ఫ్రాంచైజీలు దబాంగ్‌ ఢిల్లీ, యూ ముంబా, హర్యాన స్టీలర్స్‌ పోటీ పడ్డాయి. చివరకు ఈ 25 ఏళ్ల జవాన్‌ను రూ. 1.51 కోట్లకు హర్యానా స్టీలర్స్‌ సొంతం చేసుకుంది. వేలం తొలి రోజు ఇరానీ ప్లేయర్‌ ఫజల్‌ అట్రాచలీ కోటి పలకడంతోనే సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిసాయి. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అయితే కబడ్డీకి మంచి రోజులొచ్చాయని ట్వీట్‌ చేశాడు. 

9 ఏళ్ల నుంచే కబడ్డీ కూత..
మోను గోయట్‌ 9 ఏళ్లకే కబడ్డీ ఆడటం ప్రారంభించాడు. తన మామ అయిన మాజీ కబడ్డీ ప్లేయర్‌ విజేంధర్‌ సింగ్‌ శిక్షణలో రాటుదేలాడు. గోయట్‌ బాల్యం అంతా బివానీ జిల్లాలోని కుంగార్‌ గ్రామంలో కొనసాగింది. ఈ ఊరు నుంచి ఎంతో మంది జాతీయ స్థాయి ఆటగాళ్లు, కోచ్‌లు వచ్చారు. తన మామ కూడా 1990 బీజింగ్‌ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాన్ని మోకాలీ గాయంలో తృటిలో చేజార్చుకున్నారు.‘ గోయట్‌ చురుకైన వాడు.. అందుకే అతన్ని క్రీడలను ఎంచుకోమన్నాను. రెండేళ్లనంతరం స్టార్‌ రైడర్‌గా ఎదిగాడు’ అని ఆయన మురిసిపోయారు. 

ఉద్యోగం కోసమే ఆడేవాళ్లం..
ప్రభుత్వ ఉద్యోగం కోసమే తాము క్రీడలను ఎంచుకునేవాళ్లమని గోయట్‌ చెప్పుకొచ్చారు. అప్పుడు తమ దగ్గర డబ్బులు లేవని, ఇలాంటి లీగ్‌లు కూడా లేవని ఈ రైతు బిడ్డ అభిప్రాయపడ్డాడు. గోయట్‌ తండ్రి తనకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటర్‌ విలేజ్‌ టోర్నీ విజేతగా నిలిస్తే రూ.30వేల ప్రైజ్‌ మనీ అందిందని, అది తన డిగ్రీ చదువులకు ఉపయోగపడిందని గోయట్‌ తెలిపాడు. ఉద్యోగ లక్ష్యంలో కోసం క్రీడలను ఎంచుకున్న గోయట్‌.. 2010లో స్పోర్ట్స్‌ కోటా ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 

వృత్తీరీత్యా కొన్ని కారణాలతో తొలి మూడు సీజన్లకు దూరమైన గోయట్‌ నాలుగో సీజన్‌లో 18 లక్షలకు బెంగాల్‌ వారియర్స్‌.. ఐదో సీజన్‌లో రూ.44.5 లక్షలకు పట్నారైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ డబ్బులతో తన ఊరులో ఇళ్లును కట్టుకున్నాడు. మరిన్నీ డబ్బులతో కారు కొనుక్కున్నాడు. అయితే ఈ సారి అనూహ్యంగా కోటి యాబై లక్షల పలకడంతో ఆ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని గోయట్‌ చెప్పుకొచ్చాడు. కొంత డబ్బును తన అన్నపెళ్లికి ఖర్చుచేస్తానని తెలిపాడు. భారత్‌ తరుపున ఆడటమే తన లక్ష్యమని తెలిపాడు. గోయట్‌ ఆకల కూడా నెరవేరనుంది. భారత తరపున దుబాయ​కబడ్డీ మాస్టర్స్‌ టోర్నీలో అరంగేట్ర చేయనున్నాడు. అనంతరం ఆగష్టులో జరిగే జకర్తా ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నాడు. ఓ కబడ్డీ ఆటగాడిగా, ఆర్మీ ఉద్యోగిగా దేశానికి సేవచేయడమే నాకర్తవ్యం అని గోయట్‌ చెప్పుకొచ్చాడు. పీకేఎల్‌ 6వ సీజన్‌ అక్టోబర్‌ 19 నుంచి జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement