ఎన్నాళ్లకెన్నేళ్లకు... | Fighting a mix-up at the Australian Open | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నేళ్లకు...

Published Thu, Jan 26 2017 12:47 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM

ఎన్నాళ్లకెన్నేళ్లకు... - Sakshi

ఎన్నాళ్లకెన్నేళ్లకు...

18 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీస్‌లో మిర్యానా
క్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ ప్లిస్కోవాపై విజయం
రెండో సీడ్‌ సెరెనాతో సెమీస్‌ పోరు
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ  


మెల్‌బోర్న్‌: ఒకప్పుడు సత్తా ఉండి, సమస్యల కారణంగా మిర్యానా కెరీర్‌ ఛిన్నాభిన్నం అయినా... ఇప్పుడు జీవితంలో కుదురుకున్నాక తన రాకెట్‌తో మళ్లీ మెరిపిస్తోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన 34 ఏళ్ల మిర్యానా లూసిచ్‌ అచ్చెరువొందే ఆటతీరుతో అదరగొడుతోంది. గతంలో వరుసగా ఏడుసార్లు ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన ఈ క్రొయేషియా క్రీడాకారిణి ఈసారి మాత్రం తన ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ వారిని ఇంటిముఖం పట్టిస్తోంది. తాజాగా మిర్యానా ధాటికి ఐదో సీడ్, గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. బుధవారం గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 79వ ర్యాంకర్‌ మిర్యానా 6–4, 3–6, 6–4తో ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో టాప్‌–5లోపు క్రీడాకారిణిని మిర్యానా ఓడించడం ఇది రెండోసారి. రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్‌) పై కూడా మిర్యానా గెలిచింది.

మిర్యానా 1999లో చివరిసారి వింబుల్డన్‌ టోర్నీలో సెమీస్‌కు చేరింది. ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న ప్లిస్కోవా, మిర్యానా దూకుడుగానే ఆడారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఏకంగా 14 సర్వీస్‌ బ్రేక్‌లు నమోదయ్యాయి. ఆరంభంలో సర్వీస్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన మిర్యానా స్కోరును 3–3తో సమం చేసింది. ఆ తర్వాత ప్లిస్కోవా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 32 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో ప్లిస్కోవా పుంజుకుంది. నాలుగుసార్లు మిర్యానా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అయితే మూడో సెట్‌లో మిర్యానా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్నా, ప్లిస్కోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసి మిర్యానా విజయాన్ని ఖాయం చేసుకుంది.

సెరెనా అదే జోరు...
మరో క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) 6–2, 6–3తో తొమ్మిదో సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్‌)పై అలవోకగా గెలిచింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 10 ఏస్‌లు సంధించింది. తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది.

ఎదురులేని నాదల్‌
పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొమ్మిదో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), 15వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6–4, 7–6 (9/7), 6–4తో మూడో సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)ను ఓడించగా... దిమిత్రోవ్‌ 6–3, 6–2, 6–4తో 11వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై గెలిచాడు. నాదల్, దిమిత్రోవ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ శుక్రవారం జరుగుతుంది. రావ్‌నిచ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ ఆద్యంతం నిలకడగా ఆడాడు. తొలి సెట్‌లో, మూడో సెట్‌లో ఒక్కోసారి రావ్‌నిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. రెండో సెట్‌లో ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నాదల్‌ పైచేయి సాధించాడు. రావ్‌నిచ్‌ 14 ఏస్‌లు సంధించినా... 32 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు ఒక్కసారి కూడా నాదల్‌ సర్వీస్‌లో బ్రేక్‌ పాయింట్‌ అవకాశాన్ని సంపాదించడంలో విఫలమయ్యాడు.  

బోపన్న జంటపై సానియా జోడీ గెలుపు
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ సానియా మీర్జా (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జంట సెమీఫైనల్‌కు చేరింది. 67 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సానియా–డోడిగ్‌ ద్వయం 6–4, 3–6, 12–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రోహన్‌ బోపన్న (భారత్‌)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంటను ఓడించింది. జూనియర్‌ బాలికల సింగిల్స్‌ విభాగంలో భారత అమ్మాయి జీల్‌ దేశాయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఐదో సీడ్‌ ఓల్గా డానిలోవిచ్‌ (సెర్బియా)తో జరిగిన మూడో రౌండ్‌లో జీల్‌ తొలి సెట్‌లో 3–5తో వెనుకబడిన దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది.

నమ్మశక్యంగా లేదు. దేవుడు నాకు అండగా నిలిచాడని మాత్రం చెప్పగలను. ఈ రోజును, గత రెండు వారాలను నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. –మిర్యానా

నేటి సెమీఫైనల్స్‌  వీనస్‌ విలియమ్స్‌   vs కోకో వాండెవె
సెరెనా విలియమ్స్‌  vs మిర్యానా లూసిచ్‌ ఉదయం గం. 7.30 నుంచి
రోజర్‌ ఫెడరర్‌ vs వావ్రింకా
మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement