దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్!
దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్!
Published Fri, Sep 19 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
వెల్లింగ్టన్: ఒకప్పుడు తన ఆల్ రౌండ్ ప్రతిభతో బౌలర్లకు సింహస్వప్నంగా, బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తించిన న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కెయిర్న్స్ బ్రిటన్ ప్రభుత్వ పర్యవేక్షణలో న్యాయవిచారణను ఎదుర్కొంటున్నారు.
గతంలో తన మూడవ భార్య మెల్ క్లోజర్ కు ప్రపోజ్ చేయడానికి 3.2 క్యారెట్ల డైమండ్ ను కొనుగోలు చేసిన కెయిర్న్.. కుటుంబ పోషణ భారంగా మారడంతో తప్పని పరిస్థితిలో న్యూజిలాండ్ దేశంలోని అక్లాండ్ లో ట్రక్కులను నడపడమే కాకుండా, బస్ షెల్టర్లు క్లీన్ చేయడానికి సిద్దపడ్డారు. బస్ షెల్టర్లు క్లీన్ చేసి గంటకు 17 డాలర్లను సంపాదిస్తున్నాడు.
సొంత ఇల్లు లేదు.. ఇంటి అద్దె చెల్లించాలి. బిల్లులు చెల్లించాలి. కుటంబ ఆర్ధిక అవసరాలను తీర్చాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కెయిర్న్ కు మరోదారి దొరకలేదు అని క్లోజర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుటుంబాన్ని కష్టాల్లోంచి గట్టెక్కించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా బస్ షెల్టర్లు క్లీన్ చేయడానికి కూడా సిద్దపడ్డారని సహచర క్రికెటర్ డియాన్ నాష్ మీడియాతో అన్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో తన స్నేహితుడు బలయ్యాడని, ఫిక్సింగ్ అరోపణల నుంచి నిజాయితీగా బయటపడుతారని.. కెయిర్న్ కు తన మద్దతు ఉంటుందని నాష్ అన్నాడు.
Advertisement