
ఆంధ్ర ఫాలోఆన్
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్
విశాఖపట్నం: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర ఫాలో ఆన్‌లో పడింది. మూడో రోజు మంగళవారం ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 107.4 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా హైదరాబాద్‌కు 153 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 121/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో పటిష్ట స్థితితో ఆట ప్రారంభించిన ఆంధ్ర తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. డీబీ ప్రశాంత్ (257 బంతుల్లో 124; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (75) మరో 4 పరుగులు జత చేసి అవుటయ్యాడు. చివర్లో శివకుమార్ (33), అయ్యప్ప (31) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో ఖాద్రీ, రవికిరణ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 24 పరుగులు చేసింది.
యువరాజ్ సెంచరీ
పటియాలా: హరియాణాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 330 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యువరాజ్ సింగ్ (160 బంతుల్లో 130; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి శతకం సాధించడం విశేషం. అనంతరం 321 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హరియాణా మూడో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లకు 26 పరుగులు చేసింది.