నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు
మధ్యాహ్నం గం.3.30 నుంచి
స్టార్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
చెస్టర్ లీ స్ట్రీట్: వరుసగా రెండు పరాజయాలు... మూడో టెస్టులో కాస్త మెరుగైన ప్రదర్శనతో ‘డ్రా’తో గట్టెక్కిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ప్రతిష్ట కోసం పాకులాడుతోంది. కనీసం యాషెస్‌లో చివరి రెండు టెస్టుల్లోనైనా గెలిచి పోయిన పరువును కాస్త అయిన కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.
సిరీస్ డ్రా గా ముగిసినా కప్ రాదు కాబట్టి... ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సమం చేస్తే కంగారూల ప్రతిష్ట నిలబడుతుంది. దీని కోసం జట్టు మేనేజ్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓపెనర్‌గా వాట్సన్ విఫలమవుతున్నా.. మాజీలు మాత్రం అతన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మిడిలార్డర్‌లో వార్నర్ ఇంకా గాడిలో పడకపోవడం ఆసీస్‌ను ఆందోళన పెడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో అతన్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
క్లార్క్‌పై మరోసారి బ్యాటింగ్ భారం పడనుంది. హాడిన్, స్టార్క్‌లు లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేస్తుండం కలిసొచ్చే అంశం. వన్‌డౌన్‌లో ఉస్మాన్ ఖాజా స్థానంలో కొత్త వారికి అవకాశం దక్కొచ్చు. ఇక బౌలింగ్‌లో పేస్ త్రయం ప్రణాళికల మేరకు రాణిస్తున్నా.... స్పిన్నర్ లియోన్ కుదురుకోవాల్సి ఉంది. వాట్సన్ కూడా బౌలింగ్‌లో సత్తా చూపాల్సి ఉంది. మరోవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ జోరు కనబర్చాలని ప్రయత్నిస్తోంది. బౌలింగ్ విభాగంలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. పేసర్ గ్రాహం ఆనియన్స్‌కు అవకాశం దక్కొచ్చు. రూట్, ట్రాట్‌లు భారీ ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టారు. బెయిర్‌స్టో విఫలమవుతున్నా... ప్రయర్, బ్రాడ్ పరుగులు చేస్తుండటం జట్టుకు లాభిస్తోంది.