న్యూఢిల్లీ: తనలోని టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించినందుకు గౌతం గంభీర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని టీమిండియా యువ పేసర్ నవదీప్ షైనీ పేర్కొన్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో గంభీర్ భయ్యా చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేని తాజాగా తెలిపాడు. విండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న షైనీ మాట్లాడుతూ.. తన టాలెంట్‌ను గంభీర్ గుర్తించడమే కాకుండా ఎంతో అండగా నిలిచాడన్నాడు. ‘నా కెరీర్‍లో గంభీర్ భయ్యా సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.
ఈ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం అతడే. నేను ఏమైనా సాధిస్తే, అందులో గంభీర్ పేరు తప్పక ఉంటుంది. నా ఎదుగుదల క్రెడిట్ అంతా గంభీర్ భయ్యాదే’ అని షైనీ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో సైతం నవదీప్ షైనీ తన పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రెండో ఆటగాడిగా నవదీప్ షైనీ 152.85 కి.మీ వేగంతో రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్‌లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment