గంగూలీకి కీలక బాధ్యతలు
వర్కింగ్ గ్రూప్‌లో చోటు
- లోధా కమిటీ నివేదికపై అధ్యయనం
- వాడి వేడిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్‌కు సంబంధించి రెండు జట్లను నిషేధించాలంటూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బీసీసీఐ ఇప్పటికిప్పుడు చర్య తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ నివేదికను అధ్యయనం చేయడంతో పాటు వచ్చే ఐపీఎల్ నిర్వహణపై తగిన సూచనలివ్వాలంటూ నలుగురు సభ్యులతో బోర్డు కొత్తగా వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ కమిటీలో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాతో పాటు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుధ్ చౌదరి ఉన్నారు. బీసీసీఐ లీగల్ హెడ్ ఉషానాథ్ బెనర్జీ న్యాయపరమైన అంశాల్లో వీరికి సహకారం అందిస్తారు.
కొత్తగా ఏర్పడిన వర్కింగ్ గ్రూప్‌నకు ఆరు వారాల గడువు ఇచ్చారు. ‘లోధా కమిటీ సూచనలను ఎలా అమలు చేయవచ్చో అధ్యయనం చేయడంతో పాటు ఐపీఎల్-9 కోసం ఈ కమిటీ రోడ్‌మ్యాప్ తయారు చేస్తుంది. ఐపీఎల్‌లో కనీసం ఎనిమిది జట్లు ఉండటం మాత్రం ఖాయం. ఆటగాళ్ల ప్రతినిధిగా సౌరవ్ గంగూలీకి ఇందులో చోటిచ్చాం. వచ్చే ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా మేం జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారంగా ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తాం’ అని రాజీవ్ శుక్లా వెల్లడించారు. బీసీసీఐ ఇప్పటికే లోధా నివేదికను అంగీకరించిందని, వర్కింగ్ గ్రూప్ పేరుతో ఆ నివేదికను పక్కదారి పట్టించే ఎలాంటి పనులు చేయమని ఆయన స్పష్టం చేశారు.
అలాంటి తప్పు మళ్లీ చేయవద్దు!
ఆదివారం జరిగిన సమావేశంలో బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ రెండు జట్లను రద్దు చేయాలనే పట్టుబట్టారు. అయితే 2011లో ఇదే తరహాలో ఆవేశంగా స్పందించి కొచ్చి టీమ్‌ను రద్దు చేశామని, ఇప్పుడు ఆర్బిట్రేషన్ కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇస్తూ రూ. 550 కోట్లు చెల్లించాలని చెప్పడం తమకు ఇబ్బందిగా మారిందని మరొక సభ్యుడు అన్నారు. నాడు శశాంక్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఇప్పుడు టీమ్‌ను రద్దు చేస్తే చెన్నై కోర్టుకెక్కదని గ్యారంటీ ఏమిటి. క్రికెట్‌ను పట్టించుకోకుండా న్యాయపరమైన అంశాల కోసమే పోరాడుదామా’ అని ఈ సమావేశంలో ఆయన గట్టిగా ప్రశ్నించారు.
ఐపీఎల్ జట్లకు రవిశాస్త్రి మద్దతు...
లోధా కమిటీ నివేదికను చదవడానికి ఆరు వారాలు సమయం తీసుకుని కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం వివరాలను చెప్పడానికి కనీసం ఓ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. షెడ్యూల్ ప్రకారం తొలుత వివరాలు మీడియాకు వెల్లడించాలని భావించారు. అయితే ఈ సమావేశం వాడి వేడిగా సాగిందని సమాచారం. చెన్నై, రాజస్తాన్ జట్లపై తక్షణమే నిషేధం విధించాలనే ప్రతిపాదన రాగానే కౌన్సిల్ సభ్యుడు, భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి దీనిని వ్యతిరేకించారు. ‘లోధా కమిటీ నివేదిక వల్ల క్రికెటర్లు నష్టపోవడానికి వీల్లేదు. ఐపీఎల్ బ్రాండ్ విలువను పెంచడంలో చెన్నై కీలక పాత్ర పోషించింది. రాజ్ కుంద్రా చేసిన తప్పుకు ద్రవిడ్ శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు’ అని రవిశాస్త్రి వాదించారు. అయితే బోర్డు సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ దీనితో విభేదించారు. దీంతో జట్లపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.