
ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కలను సాకారం చేసుకొని, వంద సెంచరీలతో పాటు మరెన్నో రికార్డులను, ఘనతలను తన ఖాతాలో వేసుకొని సగర్వంగా ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రపంచకప్ కల, పలు ఘనతలు అందుకోకముందే 2007లోనే సచిన్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావించాడట. ఈ విషయాన్ని భారత క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా సేవలందించిన గ్యారీ కిర్‌స్టన్ వెల్లడించాడు. (టెండూల్కర్ డ్రైవ్... కోహ్లి క్రెసెంట్)
‘నేను టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టే సమయానికి సచిన్ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్నారు. నచ్చని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగడంపై అతడు చాలా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసేవానే. అయితే సచిన్‌తో పాటు ద్రవిడ్, లక్ష్మణ్‌లు కూడా ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారో క్రీజులోకి వెళ్లేవరకు తెలియదు. ముఖ్యంగా ఆ సమయంలో సచిన్ ఆటను ఎంజాయ్ చేయలేకపోయాడు. దీంతో ఆటను వదిలేయాలనుకున్నాడు. (ఏడు నిమిషాల్లోనే పూర్తయింది...)
అయితే నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకున్నాడో ఆ స్థానంలోనే ఆడే ఆవకాశం ఇచ్చాను. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాను. నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల వ్యవధిలోనే సచిన్ ఏకంగా 18 శతకాలు సాధించాడు. అయితే నేను గొప్ప కోచింగ్ ఇచ్చానని అనడం లేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చా వాతవరణాన్ని కల్పించా’ అని కిర్‌స్టన్ పేర్కొన్నాడు. ఇక కిర్‌స్టన్ కోచింగ్‌లోనే టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని, వన్డే ప్రపంచకప్-2011ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.