ఐపీఎల్ కన్నా దేశవాళీ మిన్న: గంభీర్
న్యూఢిల్లీ: భారత జట్టులో పునరాగమనానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వేదికగా చేసుకోబోనని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించడం ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెడతానన్నాడు. ‘జట్టులో పునరాగమనానికి ఐపీఎల్‌ను వేదికగా ఎంచుకోను. నైట్‌రైడర్స్ జట్టు విజయం కోసమే ఐపీఎల్ ఆడతా. రీ ఎంట్రీకి దేశవాళీ క్రికెట్ ఒక్కటే మార్గం. ఇప్పుడు నా దృష్టంతా దేవ్‌ధర్ ట్రోఫీ, ఐపీఎల్‌పైనే ఉంది’ అని గంభీర్ చెప్పాడు.
చెత్త ఫామ్‌తో ఏడాది కాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లండ్ పర్యటన కల్లా జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక గంభీర్, 110 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ కొలిన్ జాక్సన్, షట్లర్ అశ్విని పొన్నప్పతో కలిసి ఢిల్లీలో జరిగిన ‘వింగ్స్ ఫర్ లైఫ్ వరల్డ్ రన్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. వెన్నెముక పరిశోధనకు అవసరమైన నిధుల సేకరణ కోసం మే 4న భారత్ (సొనేపట్‌లో)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లోని 40 నగరాల్లో రన్‌ను నిర్వహించనున్నారు. ఈ రేస్‌కు గంభీర్, అశ్విని అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.