కోహ్లిపై గంభీర్ ఆసక్తికర కామెంట్లు
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లితో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి విభేదాలు లేవని సీనియర్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. మైదానంలో తామిద్దరి భావోద్దేగాలు ఒకరకంగా ఉంటాయని చెప్పాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వ్యూలో కోహ్లిపై తన అభిప్రాయాలను గంభీర్ వెల్లడించాడు. కోహ్లి నాయకత్వ పటిమను ప్రశంసించాడు. 'ఐపీఎల్ మ్యాచ్ లో కావాలనే కోహ్లితో గొడవ పడలేదు. ఇందులో వ్యక్తిగత విభేదాలు లేవు. విరాట్ కు వ్యతిరేకంగా ఆడాల్సి వస్తే దూకుడుగా ఉండక తప్పద'ని అన్నాడు. 2013 ఐపీఎల్ లో కోహ్లి, గంభీర్ మైదానంలో తిట్టుకున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ అనేది సీరియస్ క్రీడ అని, మైదానంలో దూకుడుగా ఉండడం తప్పు కాదని గంభీర్ అన్నాడు. 'విరాట్, నేను మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తుంటాం. ఆట పట్ల మాకు ఎంతో ప్రేమ ఉంది. మేమిద్దరం ఒక జట్టులో ఉంటే ఒకే లక్ష్యం కోసం ఆడతామ'ని గంభీర్ చెప్పాడు. మార్గదర్శిలా కోహ్లి కెప్టెన్సీ ఉందని కితాబిచ్చాడు. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన గంభీర్ తొలిసారి కోహ్లి నాయకత్వంలో టెస్టు మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టు రాణించి తన సత్తా తగ్గలేదని చాటాడు.