
‘క్వార్టర్’ కిక్ రెడీ
ఇకపై...
బంతిని అందుకోవాలంటే కాళ్లు అరగాల్సిందే..
గోల్ చేయాలంటే తాతలు దిగి రావాల్సిందే...
గెలవాలంటే చుక్కలు చూపించాల్సిందే..
ఇకపై...
చిన్న పొరపాటు చేసినా ఫలితం తారుమారవుతుంది..
క్షణ కాలం ఏమారినా ఓ దేశం అల్లాడుతుంది...
అప్రమత్తంగా లేకుంటే అభిమాని గుండె పగులుతుంది...
...గెలిపించినోడు హీరో... ఓడించినోడో పెద్ద విలన్... విజేతగా నిలవాలంటే సర్వం ఒడ్డాల్సిందే. ఇక బరిలో మిగిలింది ఉద్దండపిండాలే. ఏ మ్యాచ్‌లో ఎవరైనా గెలవొచ్చు. ప్రతి జట్టూ ఆఖరి క్షణం దాకా పోరాడుతుంది. ఇక సగటు ఫుట్‌బాల్ అభిమానికి కావాల్సినంత కిక్. ఇక రెండు రోజుల పాటు ఎనిమిది జట్ల ‘క్వార్టర్స్’ సమరం. శుక్రవారం జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో యూరప్ జట్లు జర్మనీ, ఫ్రాన్స్ తలపడుతుంటే... రెండో క్వార్టర్ ఫైనల్లో దక్షిణ అమెరికా జట్లు బ్రెజిల్ , కొలంబియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
జర్మనీXఫ్రాన్స్
రాత్రి గం. 9.30 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
బ్రెజిల్ Xకొలంబియా
అర్ధరాత్రి గం. 1.30 నుంచి
ముఖాముఖి తలపడిన
మ్యాచ్‌లు: 25
ఫ్రాన్స్: 11, జర్మనీ: 6
డ్రా: 8
జర్మనీ
యూరప్ ఖండంలో అత్యంత శక్తివంతమైన జట్లలో జర్మనీ ఒకటి. 1954, 74, 90లలో విజేతగా నిలిచింది. అయితే ఈసారి కప్ గెలుచుకునే స్థాయి ఉన్న జట్లలో ఒకటిగా నిలిచినా ఇప్పటిదాకా ఆ స్థాయిలో ప్రదర్శన కనబరచలేదని విమర్శలు ఉన్నాయి. లీగ్ దశ తొలి మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 4-0తో ఓడించినా ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్లతో పాటు కోచ్ జోచిమ్ లోపై ఒత్తిడి బాగానే ఉంది. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు చివరిసారి 1986లో ఆడాయి.
బలం: స్ట్రయికర్లు ముల్లర్, క్లోజ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. దీనికి తగ్గట్టుగానే ముల్లర్ నాలుగు గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ఉండగా, ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ (16) రికార్డు సాధించేందుకు మరో గోల్ దూరంలో క్లోజ్ ఉన్నాడు. ప్రపంచ నంబర్ వన్ కీపర్ మాన్యువల్ న్యూయర్ తమ అమ్ముల పొదిలో ఉండడం బలాన్నివ్వనుంది. బలహీనత: అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో జట్టు డిఫెన్స్ లోపాలు బయటపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒజిల్, బోటెంగ్, హోవెడెస్‌లను కోచ్ ఆడించిన తీరుపై మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. సెంటర్‌లో ఆడుతున్న కెప్టెన్ లామ్ ఫుల్ బ్యాక్‌లో రావాల్సి ఉంది.
ఫ్రాన్స్
ఈ ప్రపంచకప్‌లో అందరి అంచనాలకు అందని రీతిలో దూసుకుపోతున్న జట్టు ఫ్రాన్స్. ఇప్పటిదాకా 10 గోల్స్ చేసి సత్తా చాటుకుంది. 1998లో తొలిసారిగా చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఈసారి మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. సమష్టి మంత్రంతో దూసుకుపోతుంది. అలాగే 1982 సెమీస్‌లో పెనాల్టీ షూటవుట్‌లో జర్మనీ చేతిలో ఎదురైన ఓటమికి ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.
బలం: ఇప్పటిదాకా జర్మనీతో పోలిస్తే ఫ్రాన్స్ కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. స్ట్రయికర్ కరీం బెంజెమా సూపర్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశం. డిఫెన్సివ్ పరంగా ఈ జట్టు చురుగ్గా కదులుతోంది. యువ మిడ్ ఫీల్డర్ పాల్ పోగ్బా నాకౌట్‌లో జట్టును గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లోనూ తను కీలకం కానున్నాడు. వల్బుయేనా, మటౌడి, కబాయేలతో ఈ విభాగం పటిష్టంగా ఉంది.
బలహీనత: డిఫెండర్లు వరానే, సఖో గాయాలతో బాధపడుతున్నారు. స్ట్రయికర్ గిరౌడ్ ఫామ్‌లేమితో తంటాలు పడుతున్నాడు. గోల్ కీపర్ హ్యూగో లారిస్ నుంచి మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది.
క్వార్టర్స్‌కు చేరిందిలా..:
లీగ్ దశలో:
క్రొయేషియాపై 3-1తో గెలుపు
మెక్సికోతో 0-0తో డ్రా
కామెరూన్‌పై 4-1తో గెలుపు
నాకౌట్‌లో:
చిలీపై 3-2(పెనాల్టీ)తో గెలుపు
బ్రెజిల్
ప్రస్తుత టోర్నీలో ఈ జట్టుపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కచ్చితంగా కప్ గెలుచుకోవాలనే భావనలో స్వదేశీ అభిమానులు ఉండడంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అందుకే వారి కోచ్ స్కోలారి క్వార్టర్స్‌కు ముందు తమ ఆటగాళ్లకు సైకాలజిస్ట్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చారు. అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఈ జట్టు తమకే మాత్రం సమ ఉజ్జీకాని కొలంబియాతో జరిగే మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించకుండా ఆడాల్సి ఉంది.
బలం: సంచలన ఆటగాడు నెయ్‌మార్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. చిలీతో మ్యాచ్‌లో గాయానికి గురైన తను క్వార్టర్స్‌కు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుండడం అటు జట్టుకే కాకుండా అభిమానులకు కూడా ఊరటనిచ్చే అంశం. స్ట్రయికర్ హల్క్ అదరగొడుతున్నాడు. డేవిడ్ లూయిజ్, థియాగో సిల్వ, మార్సెలోతో డిఫెండింగ్ విభాగం ప్రత్యర్థికి ఆందోళన కలిగించనుంది.
బలహీనత: నెయ్‌మార్‌పై విపరీతంగా ఒత్తిడి ఉండడం. అతడితో పాటు మరో స్ట్రయికర్ ఫ్రెడ్ కూడా ఇతర జట్లకు లక్ష్యంగా ఉన్నాడు. మిడ్ ఫీల్డ్‌లో ఆస్కార్ అంచనాలను అందుకోవడం లేదు.
ముఖాముఖి:
తలపడిన మ్యాచ్‌లు: 25
బ్రెజిల్: 15
కొలంబియా: 2. డ్రా: 8
కొలంబియా
ఈ జట్టు ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా క్వార్టర్స్‌కు చేరింది. తమ గ్రూప్‌లో పెద్దగా పేరున్న జట్లు లేకపోవడం కలిసొచ్చింది. ఇప్పుడు ఓడినా పోయేదేమీ లేదు కాబట్టి కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొడదామనే జోష్‌లో ఉంది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండి ఉండడంతో మైదానంలో పాదరసంలా కదులుతూ పటిష్ట బ్రెజిల్‌కు చుక్కలు చూపించాలని అనుకుంటోంది.
బలం: ఉరుగ్వేపై రెండు గోల్స్ సాధించి జట్టును తొలిసారిగా క్వార్టర్స్‌కు చేర్చిన స్ట్రయికర్ జేమ్స్‌రోడ్రిగెజ్ ఈ జట్టుకు ప్రధాన ఆకర్షణగా మారాడు. ఇతడిని అడ్డుకోవడంపైనే బ్రెజిల్ విజయం ఆధారపడి ఉంది. వేగవంతమైన పాస్‌లతో ఇప్పటికే కొలంబియా మంచి పేరు తెచ్చుకుంది.
బలహీనత: డిఫెండర్ మారియో యోప్స్ నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. డిఫెన్స్ విభాగం కూడా పూర్తి స్థాయిలో సత్తా నిరూపించుకుంటేనే ఫలితం దక్కుతుంది.
క్వార్టర్స్‌కు చేరిందిలా..:
లీగ్ దశలో..
గ్రీస్‌పై 3-0తో గెలుపు
ఐవరీ కోస్ట్‌పై 2-1తో గెలుపు
జపాన్‌పై 4-1తో గెలుపు
నాకౌట్‌లో..
ఉరుగ్వేపై 2-0తో గెలుపు