మ్యాక్స్ వెల్, జాన్సన్ ఫైర్
న్యూఢిల్లీ: ఐపీఎల్-9 ఆరంభం నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వార్తల్లో ఉంటూ వస్తోంది. సరిగా రాణించడం లేదని మిల్లర్ ను తప్పించి సిరీస్ మధ్యలో మురళీ విజయ్ ను జట్టు కెప్టెన్ గా నియమించింది. బెంగళూరు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో కోచ్ సంజయ్ బంగర్ ను జట్టు సహయజమాని ప్రీతి జింతా దూషిచింనట్టు వార్తలు వచ్చాయి.
ఇదిలావుండగా షాన్ మార్ష్ ను స్వదేశానికి తిప్పి పంపడంపై ఓ ఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. గాయం కారణంగా అతడిని స్వదేశానికి పంపలేదని, సహచర ఆటగాడితో గొడవ పడినందుకే మార్ష్ ను తొలగించారని పేర్కొంది. డ్రెస్సింగ్ రూములో తోటి ఆటగాడిని అతడు కొట్టాడని వెల్లడించింది.
దీనిపై 'కింగ్స్' ఆటగాళ్లు మ్యాక్స్ వెల్, మిచెల్ జాన్సన్ ఘాటుగా స్పందించారు. ఇవన్నీ చెత్త వార్తలు అంటూ మ్యాక్స్ వెల్ కొట్టిపారేశాడు. 'టీమ్మేట్ ను కొట్టినందుకే మార్ష్ ను స్వేదేశానికి పంపారంట. గాయపడినందుకు కాదంటా. ఇంతకన్నా జోక్ మరోటి ఉండదంటూ' ట్వీట్ చేశాడు. ఇలాంటి కథనం రాసినందుకు దీపాంకర్ లాహిరిని ఫిక్షన్ స్టోరీ రైటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని జాన్సన్ ట్విటర్ లో పేర్కొన్నాడు.