లలిత, వికాస్ గౌడలకు స్వర్ణాలు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
వుహాన్ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం దక్కాయి. శనివారం జరిగిన 3000మీ. స్టీపుల్‌చేజ్‌లో లలితా బాబర్ 9:34.13సె. టైమింగ్‌తో జాతీయ రికార్డును సవరిస్తూ స్వర్ణం కొల్లగొట్టింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు కూడా 26 ఏళ్ల లలితా అర్హత సాధించింది. మరోవైపు 2013లోనూ స్వర్ణం సాధించిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఈసారి కూడా తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు. 62.03మీ. దూరం డిస్క్ విసిరి తొలి స్థానంలో నిలిచాడు.
10 వేల మీ. రేసులో జి.లక్ష్మణన్ 29:42.81సె.లో గమ్యం చేరి రజతం సాధించాడు. పురుషుల 200మీ. రేసులో ధరమ్‌వీర్ సింగ్, శ్రబాని నందా.. మహిళల 200మీ. రేసులో టింటూ లూకా, గోమతి ఫైనల్స్‌కు అర్హత సాధించారు.