హామిల్టన్‌ హ్యాట్రిక్‌ | Hamilton hat trick | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

Published Tue, Jun 13 2017 5:19 AM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

హామిల్టన్‌ హ్యాట్రిక్‌ - Sakshi

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

వరుసగా మూడో ఏడాది కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం
టాప్‌–6లో ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు


మాంట్రియల్‌: తన కెరీర్‌లో తొలి టైటిల్‌ సాధించిన చోట మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి మెరిశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. 2015, 2016లోనూ ఈ రేసులో గెలిచిన హామిల్టన్‌ తాజా ఫలితంతో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు. 2007లో ఇక్కడే తన కెరీర్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్న హామిల్టన్‌ 2010, 2012లోనూ ట్రోఫీని దక్కించుకున్నాడు.

 క్వాలిఫయింగ్‌ సెషన్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన హామిల్టన్‌ తన కెరీర్‌లో 65వ పోల్‌ పొజిషన్‌ సంపాదించాడు. ఈ క్రమంలో హామిల్టన్‌ ఫార్ములావన్‌లో అత్యధిక పోల్‌ పొజిషన్స్‌ సాధించిన డ్రైవర్ల జాబితాలో దిగ్గజం అయెర్టన్‌ సెనా (బ్రెజిల్‌) సరసన నిలిచాడు. షుమాకర్‌ (జర్మనీ–68 పోల్‌ పొజిషన్స్‌) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

ప్రధాన రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో మొదలుపెట్టిన హామిల్టన్‌ తొలి ల్యాప్‌ నుంచే దూసుకుపోయాడు. నిర్ణీత 70 ల్యాప్‌లను అతను గంటా 33 నిమిషాల 05.154 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌ జట్టుకే చెందిన వాల్తెరీ బొటాస్‌ రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్‌), వెటెల్‌ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు స్థానాలను సంపాదించారు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఎస్టాబెన్‌ ఒకాన్‌ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.

 తొలి ల్యాప్‌లోనే మసా (విలియమ్స్‌), సెయింజ్‌ (ఎస్టీఆర్‌) వైదొలగగా... వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) పదో ల్యాప్‌లో, క్వియాట్‌ (ఎస్టీఆర్‌) 54వ ల్యాప్‌లో, అలోన్సో (మెక్‌లారెన్‌) 66వ ల్యాప్‌లో తప్పుకున్నారు. సీజన్‌లోని 20 రేసులకుగాను ఇప్పటికి ఏడు రేసులు ముగిశాయి. ప్రస్తుతం డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో వెటెల్‌ (141 పాయింట్లు), హామిల్టన్‌ (129 పాయింట్లు), బొటాస్‌ (93 పాయింట్లు) టాప్‌–3లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 25న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement