'అందుకు మా స్పిన్నర్లే కారణం'
పల్లెకెలె:భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి రోజు శ్రీలంక ఫాస్ట్ బౌలర్లు విఫలమైనా, స్పిన్నర్లు ఆకట్టుకోవడం పట్ల ఆ జట్టు బౌలింగ్ కోచ్ చామిందా వాస్ ఆనందం వ్యక్తం చేశాడు. తమ స్పిన్నర్ల ప్రదర్శన మెరుగ్గా ఉండటం వల్లే భారత జట్టు బ్యాటింగ్ ను కట్టడి చేయకలిగే అవకాశం దక్కిందన్నాడు. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్-కేఎల్ రాహుల్ లు తొలి వికెట్ కు 188 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆపై స్వల్ప విరామాల్లో భారత జట్టు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక స్పిన్నర్లు పుష్పకుమార, సండకన్ లు రాణించడంతో భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది.
దీనిపై చామిందా వాస్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ స్పిన్ బౌలర్లు ప్రదర్శనతో్ చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు ఆకట్టుకోలేకపోవడానికి వారికి అనుభవలేమే ప్రధాన కారణమన్నాడు. తమ జట్టులో ఉన్న పేసర్లకు పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్ లు అనుభవం లేదని, అందుచేత ఆరంభంలో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నాడు. క్రమేపీ వారు పుంజుకుని రాణించడం ఒక్కటే వారు ముందున్న లక్ష్యమన్నాడు.