
హారిక ‘హ్యాట్రిక్’
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి సెమీస్‌కు
టెహరాన్ (ఇరాన్): మరోసారి టైబ్రేక్‌లో పైచేయి సాధించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ టైబ్రేక్‌లో హారిక 1.5–0.5తో విజయం సాధించింది.
తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 53 ఎత్తుల్లో గెలిచి... నల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌ను 49 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అంతకుముందు మంగళవారం నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ నిర్వహించారు. గురువారం జరిగే సెమీఫైనల్ తొలి గేమ్‌లో తాన్ జోంగి (చైనా)తో హారిక తలపడుతుంది. ఈ టోర్నీలో హారిక విజయాలన్నీ టైబ్రేక్‌లోనే ఖాయం కావడం గమనార్హం. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారిక వరుసగా మూడోసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2012, 2015లలో హారిక సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలను గెల్చుకుంది.