ఎత్తుకు ప్రాధాన్యత లేదు: సింధు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో తాను గెలిచిన ప్రతీ మ్యాచ్ ఒక సవాల్గానే ఉందని భారత షట్లర్, రజత పతక విజేత పివి సింధు స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్రపతి భనవ్లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందుకున్న సింధు.. తన రియో ఒలింపిక్స్ ప్రస్థానం గురించి వివరించింది. రియో ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయి రజతం సాధించినా, ప్రతీ మ్యాచ్ కూడా తుది పోరు తరహాలోనే ఆడాల్సి వచ్చిందని తెలిపింది.
' రియోలో ప్రతీ మ్యాచ్ నాకు సవాల్గానే ఉంది. ఆడిన ప్రతీ మ్యాచ్ ఫైనల్ పోరునే తలపించింది. మ్యాచ్లకు ముందు కోచ్ గోపీచంద్తో కలిసి గేమ్ వ్యూహంపై చర్చించే వాళ్లం. ఇలా చేయడం మ్యాచ్ల్లో విజయం సాధించడానికి చక్కగా ఉపయోగపడింది' అని సింధు తెలిపింది.
కాగా, రియో ఒలింపిక్స్లో సింధు చక్కటి ఆటతీరుతో ఆకట్టుకోవడం వెనుక ఆమె ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు
కూడా ప్రధాన పాత్ర పోషించిందంటూ చర్చలు సాగాయి. దీనిపై స్పందించిన సింధు.. బ్యాడ్మింటన్లో ఎత్తు అనేది ఎప్పుడూ ప్రధానం కాదని తెలిపింది. అసలు షట్లర్లకు ఎత్తుతో పనిలేదని సింధు అభిప్రాయపడింది.