ఆ చివరి ఓవర్ వ్యూహం ఏంటి?
క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ వహించడం అంటే ఎలా ఆడాలో సహచరులకు చెప్పడం మాత్రమే కాదు.. బంతి ఎక్కడికొస్తుందో, దాన్ని బ్యాట్స్‌మన్ ఎలా కొడతాడో.. ఆ బంతిని క్యాచ్ పట్టడానికి సరైన స్థానం ఏదో, అక్కడ ఉండాల్సిన సరైన ఫీల్డర్ ఎవరో.. ఇన్ని ఆలోచనలు నిమిషాల మీద రావాలి. ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా వచ్చిన ఆలోచనలను సరిగ్గా కొలతల ప్రకారం అమలు చేయాలి, అలా అమలుచేసిన వ్యూహం ఫలించాలి. అప్పుడే ఫలితం వస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ చిట్టచివరి ఓవర్‌లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ సరిగ్గా ఇలాగే లెక్కలు వేశాడు. అంతగా అనుభవం లేని పేస్‌బౌలర్ హార్దిక్ పాండ్యా చేతికి బాల్ ఇచ్చాడు. కానీ అంతకుముందు మొదటి స్పెల్‌లో పాండ్యా ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో విజయానికి కావల్సినవి కేవలం 11 పరుగులే. సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా ఉన్నా.. అతడి కోటా అప్పటికే అయిపోయింది.
దాంతో సీనియర్ సహచరులంతా పాండ్యాను దగ్గరకు తీసుకుని తమకు తోచిన అన్నిరకాల సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా నెహ్రా అయితే బాల్ ఎలా వేయాలన్న విషయం మీద చివరి నిమిషం వరకు చెబుతూనే ఉన్నాడు. ధోనీ మాత్రం చాలా కూల్‌గా బాల్ వేయాల్సిన విధానంతో పాటు ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఆ టైంలో యార్కర్లు వేయొద్దని స్పష్టం చేశాడు. కాస్త బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీ వేయాలని.. అయితే ఎంత లెంగ్త్ అన్నది మాత్రం మళ్లీ అప్పటికప్పుడు చూసుకోవాల్సిందేనని అన్నాడు. మళ్లీ వైడ్ బాల్ మాత్రం వేయొద్దని, అలా వేస్తే బంతి కీపర్ చేతిలోకి వచ్చేలోపు బ్యాట్స్‌మన్ ఓ పరుగు తీసేస్తాడని తెలిపాడు. అందరి ఆలోచనలను పాండ్యా చాలా చక్కగా అమలుచేశాడని చెప్పాడు.
పాండ్యా ఆఫ్ స్టంప్‌కు కొద్ది అవతలగా బాల్స్ వేయడంతో వాటిని భారీ షాట్‌గా మార్చాలనుకున్న ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా, ముష్ఫిఖుర్ రహీమ్ ఇద్దరూ ఒకరు శిఖర్ ధావన్‌కి, మరొకరు రవీంద్ర జడేజాకు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు. కేవలం రెండు పరుగులు తీస్తే సరిపోయేదానికి ఫ్యాన్సీషాట్ కొట్టి ముగించాలనుకోవడం వాళ్లు చేసిన తప్పు అని కామెంటేటర్ స్పష్టంగా చెప్పారు. ఇక చివరి బంతి కూడా కొంచెం వైడ్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేయడంతో.. అది షువగత బ్యాట్‌కు తగిలీ తగలనట్లుగా అయ్యింది. కనీసం ఒక పరుగు తీస్తే సూపర్ ఓవర్ వస్తుందన్న ఆశతో పరుగు మొదలుపెట్టారు. కానీ, వికెట్ల వెనక ఉన్నది జార్ఖండ్ చిరుత. 15 అడుగుల దూరంలో ఉన్న వికెట్ల దగ్గరకు బంతి తీసుకుని ఒక్క ఉదుటున పరుగు తీశాడు. నేరుగా త్రో చేసే అవకాశం ఉన్నా, అది గురితప్పితే రిస్క్ ఎందుకని.. బంతి ఉన్న చేత్తోనే వికెట్లు పడగొట్టాడు. అంతే.. బంగ్లా ఆశలు కుప్పకూలిపోయాయి, టీమిండియా సగర్వంగా తలెత్తుకుంది.