ప్రపంచకప్ తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నాం
టి20 ప్రపంచకప్ సాధించేందుకు తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని టీమిండియా రథసారథి మహేంద్రసింగ్ ధోనీ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆసియా కప్‌ను సాధించిన అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ చాలావరకు పని ముందే చేసిపెట్టేస్తున్నారని, ఇక లోయర్ ఆర్డర్ వాళ్లు వెళ్లి.. కావల్సినది పూర్తిచేసుకుంటే సరిపోతోందని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ లైనప్ చాలా బాగుందని, టి20 ప్రపంచకప్ కోసం తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని అన్నాడు. యువ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ సంచలనం హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లు కురిపించాడు.
బుమ్రా అద్భుతమైన యార్కర్లు వేస్తాడని, అవి లేకపోతే ఇంకా చాలా రకం ఇతర బంతులను ప్రయత్నించాల్సి ఉంటుందని.. బుమ్రా కొద్దిగా యాక్షన్ మార్చుకుంటే ఇంకా చాలా ఉపయోగపడుతుందని ధోనీ అన్నాడు. హార్దిక్ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడని, అతడి బ్యాటింగ్, ఫీల్డింగ్ నైపుణ్యంతో కలిపి మంచి ఆల్‌రౌండర్ అయ్యాడని ప్రశంసించాడు. యువరాజ్‌సింగ్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగుకు పంపడం ప్రస్తుత పరిస్థితిలో కష్టమని, కానీ తన స్థానంలో యువీ చాలా బాగా కుదురుకున్నాడని చెప్పాడు. టీమ్‌లో 13-14 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ప్రతి ఒక్కళ్లూ గేమ్ ఫినిష్ చేయడానికి తమ బాధ్యతను తీసుకుంటున్నారని అన్నాడు. కాంబినేషన్లు సెట్ కావడం చాలా ముఖ్యమని, అది తమకు కుదిరిందని చెప్పాడు.
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో, అది కూడా జట్టుకు అవసరమైన సమయంలో 60 పరుగులకు పైగా సాధించడం తనకు చాలా స్పెషల్ అని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శిఖర్ ధవన్ అన్నాడు. తామంతా ఒక టీమ్‌గా కష్టపడ్డామని, సరైన సమయంలో పుంజుకున్నామని చెప్పాడు. భారీ టార్గెట్లు ఛేజ్ చేసేముందు తాము మాట్లాడుకుంటున్నామని.. ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఏ క్షణంలోనూ తాము ఒత్తిడికి గురికాలేదని.. పూర్తి కంట్రోల్లో ఉన్నామని తెలిపాడు.