
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్ స్టేట్ ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఈసీడీజీ సీనియర్ జట్టు విజేతగా నిలిచింది. జూనియర్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అక్కడి సెయింట్ లారెన్స్ అకాడమీ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో ఈసీడీజీ సీనియర్ జట్టు 123 పరుగుల తేడాతో దినేశ్ వర్మ క్రికెట్ ఫౌండేషన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆసిఫ్ బాష (80) రాణించగా, రకెల్ బారీ 30, అలీఖాన్ 18 పరుగులు చేశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దినేశ్ వర్మ క్రికెట్ ఫౌండేషన్ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. ఈసీడీజీ బౌలర్లు అనిల్ కుమార్ 3, హరమ్, చరణ్ చెరో 2 వికెట్లు తీశారు. జూనియర్స్ ఫైనల్లో సెయింట్ లారెన్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ఈసీడీజీ జూనియర్స్‌పై గెలిచింది. తొలుత ఈసీడీజీ జూనియర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఐజాజ్ (86 నాటౌట్) అర్ధసెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లలో గౌరవ్, గజి రెండేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లారెన్స్ క్రికెట్ అకాడమీ జట్టు 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. సంచిత్ (80 నాటౌట్) తుదికంటా అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈసీడీజీ బౌలర్లలో యాసిన్, అక్షయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.