హైదరాబాద్ మ్యాచ్ రంజీ డ్రా
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చక్కని పోరాటం కనబర్చినప్పటికీ ఆధిక్యం మాత్రం దక్కలేదు. రంజీట్రోఫీ గ్రూప్-సిలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో అహ్మద్ ఖాద్రీ (294 బంతుల్లో 113; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కగా, విహారీ (207 బంతుల్లో 80; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. హబీబ్ (74 బం తుల్లో 44; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. మహారాష్ట్రకు 88 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ... హెదరాబాద్ ఆలౌట్ కాకపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి.
ఖాద్రీ సెంచరీ
ఆదివారం 290/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఖాద్రీ, విహారీ నిలబెట్టారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచారు. వికెట్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా ఇద్దరూ బ్యాటింగ్ చేయడంతో పరుగుల వేగం మందగించింది. ఈ క్రమంలోనే విహారీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ ఐదో వికెట్‌కు 136 పరుగులు జోడించిన తర్వాత విహారిని ఖురానా క్లీన్‌బౌల్డ్ చేయగా, అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన షిండే (2) దరేకర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో హబీబ్‌తో కలిసిన ఖాద్రీ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 460 పరుగుల వద్ద హబీబ్ నిష్ర్కమించగా... ఖాదర్ (19) అండతో ఖాద్రీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ సిక్సర్‌తో సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. మహారాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 616/9 స్కోరు చేసింది.
మహారాష్ట్ర బౌలర్ యాక్షన్ సందేహాస్పదం!
మరో వైపు మహారాష్ట్ర పేసర్ సచిన్ చౌదరి బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. మ్యాచ్ మూడో రోజు శనివారం అతడిని అంపైర్లు రెండు సార్లు హెచ్చరించారు. అయితే చివరి రోజు లంచ్ తర్వాత మళ్లీ సచిన్ యాక్షన్‌ైపై సందేహం రావడంతో అతడిని బౌలింగ్ నుంచి తప్పించారు. ఎన్‌సీఏలో తన యాక్షన్‌ను సరిదిద్దుకునే వరకు ఇకపై అతను మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు.