'ఈసారి ఐపీఎల్లో ఆడలేనేమో'
హైదరాబాద్:గతేడాది ఐపీఎల్ టైటిల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించడంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఐపీఎల్ సీజన్లో ముస్తఫిజుర్ ఇంకా సన్ రైజర్స్ జట్టుతో కలవలేదు. శుక్రవారం నాటికి ముస్తఫిజుర్ జట్టుతో కలుస్తాడని సన్ రైజర్స్ యాజమాన్యం ఆశించనప్పటికీ అది జరగలేదు. ప్రస్తుతం శ్రీలంక పర్యటన ముగించుకున్న తరువాత ముస్తఫిజుర్ నేరుగా స్వదేశానికి వెళ్లిపోయాడు.ప్రధానంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుమతి కోసం ముస్తఫిజుర్ నిరీక్షిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆ యువ బౌలర్ స్పష్టం చేశాడు.
'గతేడాది ఐపీఎల్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈసారి ఐపీఎల్లో ఆడతానని అనుకోవడం లేదు. మా జాతీయ జట్టు షెడ్యూల్ బిజీగా ఉండటంతో నేను ఐపీఎల్లో ఆడటంపై ఇంకా స్పష్టత లేదు. మా క్రికెట్ బోర్డు అనుమతి కోసం చూస్తున్నా. బోర్డు అంగీకారం తెలిపితే ఐపీఎల్లో ఆడతా' అని ముస్తఫిజర్ రెహ్మాన్ తెలిపాడు. గతేడాది ఐపీఎల్లో 17 వికెట్లు తీసి సన్ రైజర్స్ టైటిల్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఒకవేళ ముస్తఫిజుర్ కు అనుమతి లభిస్తే మాత్రం రెండు రోజుల్లో సన్ రైజర్స్ తో కలిసే అవకాశం ఉంది.