'ధోని సేనకు గెలుపు కష్టమే'
మెల్బోర్న్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా నిలువరిస్తుందని తాను అనుకోవడం లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా వన్డేల్లో టీమిండియా కంటే ఆస్ట్రేలియా చాలా రెట్లు బలంగా ఉందని చాపెల్ పేర్కొన్నాడు. అందులోనూ స్వదేశంలో సిరీస్ జరగడమే కాకుండా, జట్టులో స్పెషలిస్టు ఆటగాళ్లు ఉండటం కచ్చితంగా ఆసీస్కు కలిసొస్తుందన్నాడు.
టీమిండియా జట్టులో నాణ్యమైన ఆటగాళ్ల కొరత ఎక్కువగా ఉందన్నాడు. ప్రత్యేకించి ఆల్ రౌండర్లు లేమి ధోని సేనలో స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. ఇక టీమిండియా బౌలర్ల విషయానికొస్తే ఆసీస్ వంటి బౌన్సీ పిచ్ లపై రాణించడం ఒక పరీక్షగా నిలుస్తుందని చాపెల్ పేర్కొన్నాడు. త్వరలో భారత్లో ట్వంటీ 20 వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో వారిని మానసికంగా దెబ్బతీయడానికి ఆసీస్ కు ఇదొక చక్కని అవకాశం అన్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడని, ధోని కంటే స్మిత్ చాలా విషయాల్లో మెరుగ్గా ఉన్నాడని డైలీ టెలిగ్రాఫ్ రాసిన కాలమ్ లో పేర్కొన్నాడు.