'కోహ్లి.. అతన్ని మించిపోయాడు'
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ఆల్ టైమ్ గ్రేట్ ఫినిషర్ అంటూ చాపెల్ పొగడ్తలతో ముంచెత్తాడు. అతను మణికట్టుతో బంతిని హిట్ చేసే విధానం అమోఘమన్నాడు. వరల్డ్ కప్ లో ఆసీస్పై విరాట్ అజేయంగా నమోదు చేసిన 82 పరుగులు అతని ట్వంటీ 20 ఇన్నింగ్స్లలోనే ఉత్తమంగా చాపెల్ అభివర్ణించాడు.
'వెస్టిండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారా కచ్చితమైన ప్లేస్ మెంట్ తో కొట్టే షాట్లను విరాట్ అధిగమించాడు. ప్లేస్ మెంట్లో లారాను వెనక్కు నెట్టిన కోహ్లి అగ్రస్థానంలోకి వచ్చాడు. కోహ్లిని చూస్తే గోడలా కనిపిస్తున్నాడు. ఛేజింగ్ లో కోహ్లి ఉత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో హోబార్ట్ లో శ్రీలంక300 పైగా స్కోరును నమోదు చేస్తే కోహ్లి అజేయ సెంచరీతో ఆ మ్యాచ్ ను 36.4 ఓవర్లలోనే ముగించాడు. ఆ తరువాత మరే ఇతర ఆటగాడు ఇంతలా ఛేజింగ్ చేయడం నేను చూడలేదు. మణికట్టుతో పవర్ ఫుల్ షాట్లు ఆడగల అరుదైన క్రికెటర్లలో కోహ్లి ఒకడు. అది అందరికీ సాధ్యం కాదు. భారత్ తరపున మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లే ఆ తరహా ఆడేవారు. ఇప్పుడు కోహ్లి ఆటతీరు వారిని గుర్తుకుతెస్తుంది' అని చాపెల్ కొనియాడాడు.