
సాక్షి క్రీడావిభాగం: ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో సౌతాంప్టన్‌లో నాలుగో టెస్టు...! ప్రత్యర్థి జట్టు స్పిన్నర్ మొయిన్ అలీ (5/63; 4/71) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.ఇదే సమయంలో అతడి కంటే అన్ని విధాలా మెరుగైన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అశ్విన్ (2/40; 1/84) తేలిపోయాడు. దీంతో అలీతో పోల్చుతూ అతడిపై విమర్శలు వచ్చాయి. పూర్తి ఫిట్‌గా లేడన్న వ్యాఖ్యలు వినిపించాయి. దీనికి తగ్గట్లే అతడిని తర్వాతి టెస్టు ఆడించలేదు. అనంతరం అశ్విన్ బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాస శిబిరంలో చేరాడు. ఆ గతమంతా వదిలేస్తే ఇప్పుడు సీనియర్ స్పిన్నర్ ఫిట్‌నెస్ సంతరించుకుని వెస్టిండీస్‌తో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్ టెస్టు వైఫల్యం, వన్డేలకు దూరం కావడం, కొంతకాలంగా తన ప్రదర్శనతో పాటు పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చాడు. అఫ్గానిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ నుంచి కొత్త అస్త్రాన్ని నేర్చుకున్నానన్న ఆసక్తికర సంగతిని అందులో వివరించాడు. ఆ విశేషాలేమిటో చదవండి...!
సౌతాంప్టన్‌లో వైఫల్యంపై...
మూడో టెస్టులోనే సమస్య తలెత్తింది. సౌతాంప్టన్‌లో ఇబ్బందిపడింది వాస్తవమే. అయినా జట్టు గెలుపు కోసం కృషి చేశా. ఓడిపోవడంతో అందరి దృష్టి నా ప్రదర్శనపైనే పడింది. నా బౌలింగ్ ఏమంత దారుణంగా లేదు. క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారికి ఈ విషయం తెలుస్తుంది. కానీ, ప్రత్యర్థి స్పిన్నర్‌తో పోల్చి నేను రాణించలేదని అంటున్నారు. శరీరం సహకరించి ఉంటే మెరుగ్గా ఆడేవాడినే కదా? సౌతాంప్టన్ పిచ్‌పై పగుళ్లను నా కంటే మొయిన్ అలీ ఎక్కువ సద్వినియోగం చేసుకున్నాడనే దానిని అంగీకరించను. ఇక్కడ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను ధాటిగా ఎదుర్కొన్న తీరును గమనించాలి. పైగా మా బ్యాటింగ్ సందర్భంగా రెండు ఇన్నింగ్స్‌లోనూ వారిదే పైచేయిగా ఉంది. మొత్తమ్మీద ఇంగ్లండ్‌లో నా బౌలింగ్‌ను గాయం ఇబ్బంది పెట్టలేదు. అయినా, ఇదంతా ఆటలో భాగం.
తాజా ఫిట్‌నెస్‌పై...
ఇంగ్లండ్ నుంచి వస్తూనే పరుగు సాధన చేశా. ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నా. తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.
బౌలింగ్ శైలిలో మార్పులపై...
గాలిలో బంతి వేగం (ఎయిర్ స్పీడ్)ను సరిచేసుకోవాలని భావించా. అందుకనే చేతులను స్వేచ్ఛగా కదుపుతూ బంతిని విసిరే నా పాత బౌలింగ్ శైలికి మారాను. ఈ మార్పు ఫలించింది. అనుకున్నది సాధించా. నాకు నేనే పెద్ద విమర్శకుడిని. ఏది సరైనదో నాకు తెలుసు. కాబట్టి ఇతరుల విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
వన్డేల్లో చోటు కోల్పోయిన ఈ ఏడాదిపై...
నేను సానుభూతి కోరుకునే రకం కాదు. ఏం జరిగినా మన మంచికే అనుకుంటా. ఈ ఏడాదిలో నా గురించి నేను తెలుసుకున్నా. పరిస్థితులు అనుకూలంగా మారే వరకు ఓపిక పట్టాలి. అవకాశం వచ్చినప్పుడు మానసికంగా దృఢంగా ఉంటూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రమంలో శారీరకంగా ఫిట్‌గా ఉండటంపైనా దృష్టిపెట్టా. ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఇలాంటివి సహజమే. ఇంగ్లండ్ కౌంటీల్లో వన్డేలు ఆడటం నేనింకా పోటీలో ఉండేలా చేసింది.
బ్యాటింగ్ సామర్థ్యంపై...
గత 18 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ శతకం కూడా చేయనిది వాస్తవమే. కానీ, నాలుగు సార్లు 30లు, రెండుసార్లు 20లు చేశా. రెండుసార్లు సహచరుల కారణంగా రనౌటయ్యా. జట్టు స్కోరే 200 ఉన్నప్పుడు నేను చేసిన 20లు, 30లు ప్రాధాన్యమైనవే అనేది గుర్తించాలి. అయితే, 30లను మరింత పెద్ద స్కోరుగా మలుచుకోవడంపై దృష్టిపెట్టాల్సి ఉంది.
ముజీబ్ నుంచి నేర్చుకోవడంపై...
ఐపీఎల్‌లో నాకు కూడా అతడినుంచి నేర్చుకునే అవకాశం కలిగింది. క్యారమ్ బాల్ సహా నేను వేసే బంతులన్నీ అతడు వేస్తాడు. ముజీబ్ నుంచి రివర్స్ అండర్ కటర్ వేయడం ఎలాగో నేను తెలుసుకున్నా. అది టి20ల్లో చాలా బాగా పనిచేస్తుంది.
ఆఫ్ స్పిన్నర్‌ల ప్రాధాన్యంపై...
ఈ అంశం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో వికెట్లు తీయడమే ముఖ్యం అనుకుంటున్నారు. దీంతో ఆఫ్ స్పిన్నర్లకు గడ్డు కాలం నడుస్తోంది. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో మొయిన్ అలీ, ఇటీవలి ఆసియా కప్‌లో ముజీబ్, జడేజా, మెహదీ హసన్ రాణించిన సంగతిని మర్చిపోవద్దు.
పరిమిత ఓవర్ల క్రికెట్ కెరీర్‌పై...
తెల్ల బంతితో ఆడకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదు. నాతో పాటు జడేజా స్థానంలో వచ్చిన కుల్దీప్, చహల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి మెరుగైన ఆరోగ్యకర పోటీ అనేది ఏ జట్టులోనూ లేదు. అవకాశం కోసం చూడడమే మేం చేయాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment