
న్యూఢిల్లీ: పదునైన వేగం, అన్ని పిచ్‌లపై చెలరేగే సత్తా ఉన్నా ఉమేశ్ యాదవ్‌కు ఇతర భారత పేస్ బౌలర్లతో పోలిస్తే తగినన్ని అవకాశాలు రావడం లేదు. వన్డేల్లో చాలా కాలంగా జట్టుకు దూరమైన అతను టెస్టుల్లో కూడా ఇషాంత్, షమీ, బుమ్రాల జోరులో రిజర్వ్ స్థానానికే పరిమితం కావాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. అయితే తానేమీ బాధ పడటం లేదని, అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవడం తన పని అని అతను వ్యాఖ్యానించాడు. 2018నుంచి చూస్తే ఉమేశ్ 10 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. వీటిలో అతను 45 వికెట్లు పడగొట్టాడు.
‘ఈ విషయంలో నన్ను నేను బాధితుడిగా భావించుకోవడం లేదు. కొన్ని సార్లు ఆడతాం. కొన్ని సార్లు ఆడలేమంతే. నిజాయితీగా చెప్పాలంటే మానసికంగా నేను చాలా దృఢంగా ఉంటాను. ఇలాంటి సమయంలో అది ఎంతో ముఖ్యం. మ్యాచ్‌లో ఎవరికైన్నా అవకాశం దక్కవచ్చు. ఫామ్, పిచ్, వాతావరణ పరిస్థితులు... ఇలా ఒక బౌలర్‌ను తీసుకునేందుకు ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి దాని గురించి అతిగా ఆలోచించను. మ్యాచ్‌లో అవకాశం దక్కనప్పుడు కూడా నా ఆటను మరింత మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెడతా. ఇలాంటి సమయంలో ఎవరి దగ్గరికో వెళ్లి సలహాలు అడగను’ అని ఉమేశ్ యాదవ్ చెప్పాడు. లాక్‌డౌన్ సమయంలో శరీర దారుఢ్యాన్ని పెంచుకునేందుకు స్ట్రెంత్ ట్రైనింగ్‌పైనే దృష్టి పెట్టినట్లు అతను వెల్లడించాడు.