కరాచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటను అభిమానించే మాజీల జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. పాకిస్తాన్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జావేద్ మియాందాద్ కూడా కోహ్లి ఆటంటే తనకు ఇష్టమని వెల్లడించాడు. విరాట్ గొప్పతనం ఏమిటో అతని ఘనతలే చెబుతాయని మియాందాద్ అన్నాడు. ‘భారత జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఎవరని నన్ను కొందరు ప్రశ్నించారు. అప్పుడు నేను కోహ్లి పేరే చెప్పాను. నేను కొత్తగా అతని గురించి వివరించాల్సిందేమీ లేదు. అతని ప్రదర్శన, గణాంకాలు చూస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే. దక్షిణాఫ్రికాలో అనూహ్యంగా స్పందించిన పిచ్‌పై కూడా అతను సెంచరీ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే భయపడతాడని, బౌన్సీ పిచ్‌లపై ఆడలేడని, స్పిన్‌ను ఎదుర్కోలేడని... ఇలా ఏ విషయంలోనైనా కోహ్లి గురించి ఎవరూ ప్రశ్నించలేరు. అతని సత్తా ఏమిటో అందరికీ తెలుసు. కోహ్లి చూడచక్కగా ఆడతాడు. అతని బ్యాటింగ్‌ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది’ అని మియాందాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 124 టెస్టులు ఆడిన మియాందాద్ 52.57 సగటుతో 8832 పరుగులు చేసి పాక్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment