'ఆమిర్ జీవితాన్ని గుణపాఠంగా తీసుకోండి'
ముంబై: అంతర్జాతీయ మ్యాచ్లో ఫిక్సింగ్ కు పాల్పడి ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ మొహ్మద్ ఆమిర్ జీవితాన్ని యువ క్రికెటర్లు ఓ గుణపాఠం తీసుకోవాలని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమిర్ పై రూపొందించిన వీడియోను ఏసీయూ అవినీతి నిరోధక శాఖ రూపొందించింది. మరో రెండు రోజుల్లో భారత్లో వరల్డ్ టీ 20 ఆరంభం కానున్న నేపథ్యంలో అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాన్ని ఏసీయూ చైర్మన్ సర్ రోనీ ఫ్లనాగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమిర్ క్రికెట్ జీవితాన్ని ఓ ఉదాహరణగా పేర్కొన్నారు.
'ఆమిర్ క్రికెట్ జీవితంలో చేసిన తప్పులతో కష్టాలు తెచ్చుకున్నాడు. తద్వారా మూడు నెలల జైలు జీవితంతో పాటు, ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆమిర్ జైలు నుంచి వచ్చిన తరువాత అతనిపై రూపొందించిన వీడియోను చాలాసార్లు మీకు పరిచయం చేశాం. మేము అవినీతిపై చేసే పోరాటంలో ఆమిర్ వీడియో చేసే అవకాశాన్ని కల్పించాడు. ఎవరైనా తప్పు చేసిన తరువాత ఒప్పుకోవడం కూడా ముఖ్యమైనదే. ఆమిర్ తప్పుచేసి, బహిరంగంగా క్షమాపణలు కోరాడు. దీనివల్ల ఫిక్సింగ్ తరహా ఘటనలను ఎంతో కొంత నిరోధించవచ్చు. ఆమిర్ పై వీడియోను క్రికెటర్లకు చూపిస్తాం. మన లక్ష్యం అవినీతిని రూపుమాపడం. ఇందుకోసం ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో సహా అంతా సహకరించాలి. మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఎవరైనా నేరానికి పాల్పడినట్లు ఆటగాళ్లకు, అధికారులకు తెలిస్తే వెంటనే మాకు తెలియజేయండి. ఒకవేళ అలా చేయకపోతే మీరు అవినీతిలో భాగం పంచుకున్నవారవుతారు. దీనికోసం మా హాట్లైన్ నంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి' అని ఫ్లనాగన్ పేర్కొన్నారు.
ఇటీవల మొహ్మద్ ఆమిర్ పాకిస్తాన్ జాతీయ జట్టులో పునరాగమనం చేసిన తెలిసిందే. 2010లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా ఆమిర్తో పాటు సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్లు ఫిక్సింగ్కు పాల్పడి నిషేధం బారినపడ్డారు.