
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తి మరచి ప్రవర్తించిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, రిజర్వ్ ప్లేయర్ నురుల్ హసన్‌లపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ చివరి ఓవర్లో మైదానంలో గందరగోళ పరిస్ధితి ఏర్పడిన విషయం తెలిసిందే. రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంపై బంగ్లా బ్యాట్స్‌మన్ అసహనానికి గురయ్యారు. ముస్తఫిజుర్ రనౌటైన గ్యాప్‌లో గ్రౌండ్‌లోకి వచ్చిన బంగ్లా రిజర్వ్ ప్లేయర్ నురుల్ శ్రీలంక కెప్టెన్ తిసారా పెరిరాతో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పేలోపే కెప్టెన్ షకీబ్ బౌండరీ దగ్గరకొచ్చి ‘బయటికి వచ్చేయండి..’ అంటూ గట్టిగా కేకలు వేశాడు.
ఈ ఘటనను సిరీయస్‌గా పరిగణించిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బోర్డ్ ఐసీసీ కోడ్ 2.1.1 ప్రకారం షకీబ్, 2.1.2 కింద నూరుల్ క్రీడాస్పూర్తిని దెబ్బతీస్తూ నిబంధనలు అతిక్రమించారని జరిమాన విధించారు. ఈ వివాదంపై రిఫరీ విచారం వ్యక్తం చేశారు. ఉత్కంఠగా సాగుతున్న ఆటలో ఇలాంటి ఉద్వేగాలు సహజమే కానీ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఇక ఫోర్త్ అంపైర్ షకీబ్‌ను ఆపకపోవడం, మైదానంలోని అంపైర్లు నూరుల్, తిసారాల మధ్య గొడవ జరుగుతుండగా కల్పించుకోకపోవడం పరిస్థితి మరింత అధ్వాన్నంగా మార్చాయని చెప్పుకొచ్చారు.
ఇక ఈ ఉత్కంఠకర మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్ ఓ బంతి మిగిలి ఉండగానే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడునుంది.
Comments
Please login to add a commentAdd a comment