సాక్షి, న్యూఢిల్లీ: 40 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఆడినపుడు.. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా విషయంలో వచ్చిన సమస్య ఏమిటని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించారు. ఆసీస్ తో మూడు టీ20లకు ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో నెహ్రాకు అనూహ్యంగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అయితే రైనా, యువరాజ్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కకుండా ఈ సీనియర్ బౌలర్‌కు అవకాశం రావడం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్లు మాత్రం ఈ విషయంలో సెలక్టర్లను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే గంగూలీ క్రికెట్ కు వయస్సుతో సంబంధం లేదని నెహ్రా ఎంపికపట్ల మద్దతుగా నిలవగా తాజాగా సెహ్వాగ్ ఆ జాబితాలో చేరారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు.
‘నెహ్రా ఎంపిక నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అతను జట్టులో చోటు దక్కించుకోవడం చాల సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్ లు ఆడాలని కోరుకుంటున్నా. నెహ్రా ఎంపిక వెనుక ఉన్న రహస్యం అతని ఫిట్ నెస్. అతను అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడనప్పుడు పూర్తి సమయాన్ని జిమ్ కే కేటాయిస్తాడు. అంతేగాకుండా ఆటగాళ్లకు నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్ష యో-యో టెస్టులో నెహ్రా 18 స్కోరు సాధించాడు. ఇది దాదాపు కోహ్లి స్కోరుకు సమానం. ఫిట్‌నెస్‌కు అతని హైట్ కలిసొచ్చే అంశం. ఫాస్ట్ బౌలర్ కావడంతో పరుగులో కూడా ఎలాంటి సమస్య లేదు. క్రికెట్ ఆడటానికి వయస్సుతో సంబంధం లేదని నేను భావిస్తాను. శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 42 ఏళ్ల వయసులో, సచిన్ 40 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడలేదా? అలాంటప్పుడు ఫిట్‌గా ఉన్న నెహ్రాకు వచ్చిన సమస్య ఏమిటి? యువరాజ్, రైనాలు యో-యో టెస్టు అర్హత సాధించలేకపోవడంతో జట్టులో వారికి చోటు దక్కలేదు. క్రికెట్‌లో కొనసాగాలంటే ఫిట్‌నెస్ ముఖ్యం. ఫిట్‌గా ఉంటే హిట్ చేయవచ్చు. ప్రస్తుత జట్టులో అన్‌ఫిట్ ఎవరూ లేరు’. అని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment