అతడి పేరు... హికేన్ షా
* తాంబేను ఫిక్సింగ్ చేయమన్నది అతనే
* ముంబై క్రికెటర్‌పై వేటు వేసిన బీసీసీఐ
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయాల్సిందిగా సహచర ముంబై క్రికెటర్ ప్రవీణ్ తాంబేను కోరిన ఆటగాడి పేరును బీసీసీఐ వెల్లడించింది. 30 ఏళ్ల హికేన్ షా.. తాంబేను సంప్రదించాడని, బోర్డు అవినీతి వ్యతిరేక కోడ్‌ను ఉల్లంఘించినందుకు వెంటనే అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొంది. తుది శిక్ష కోసం క్రమశిక్షణ కమిటీకి అతడి పేరును పంపినట్టు తెలిపింది.
అలాగే షాను సస్పెండ్ చేస్తున్నట్టు ముంబై క్రికెట్ సంఘానికి సమాచారమిచ్చింది. ‘బీసీసీఐ అవినీతి వ్యతిరేక కోడ్‌ను షా అతిక్రమించినట్టు రుజువైంది. క్రమశిక్షణ కమిటీ తుది తీర్పు వెల్లడించేదాకా బోర్డు గుర్తింపు పొందిన ఏ క్రికెట్ మ్యాచ్‌లను కూడా తను ఆడడానికి వీల్లేకుండా సస్పెండ్ చేస్తున్నాం’ అని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గుజరాత్‌కు చెందిన హికేన్ షా ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించకపోయినా ముంబై తరఫున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2,160 పరుగులు సాధించాడు.
ఐపీఎల్-8 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ప్రవీణ్ తాంబేను హికేన్ షా ఫిక్సింగ్ కోసం ప్రలోభ పెట్టగా అతడు ఏసీఎస్‌యూకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షాపై తీసుకున్న నిర్ణయం అవినీతిపై బోర్డు ఎంత కఠినంగా ఉందో తెలియపరుస్తుందని అధ్యక్షుడు దాల్మియా అన్నారు.
నమ్మలేకపోతున్నాం: ఎంసీఏ
హికేన్ షాపై బోర్డు సస్పెన్షన్ విధించడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ‘షా ఇలాంటి పనికి పాల్పడ్డాడంటే నమ్మలేకున్నాం. నిజంగా ఇది మాకు షాకింగ్ వార్త. అతనెప్పుడూ ఇలా అనుమానాస్పదంగా కనిపించింది లేదు. చాలా సిన్సియర్‌గా కనిపించేవాడు’ అని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పీవీ శెట్టి అన్నారు. ముంబై క్రికెట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
కోచింగ్ విషయంపై సంప్రదించాను
‘బీసీసీఐ నిర్ణయంతో షాక్‌కు గురయ్యాను. నేను ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. కోచింగ్ విషయంలో తాంబేను నేను కలుసుకున్నాను. అంతేకానీ అవినీతి విషయంలో కాదు. ఇప్పటికే బోర్డుకు నేను సమాధానం చెప్పాను. అంతకుమించి చెప్పాల్సింది ఏమీ లేదు’ - హికేన్