'నర్సింగ్ పై నాకు నమ్మకం ఉంది'
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్లో డోపింగ్ వివాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. నర్సింగ్ యాదవ్ డోపింగ్ ఉదంతాన్ని చూస్తే చాలా అనుమానాలకు తావిస్తోందన్నాడు. తన సహచర రెజ్లర్ నర్సింగ్ డోపింగ్ కు పాల్పడ్డాడని తాను అనుకోవడం లేదన్నాడు. దీనిపై కచ్చితంగా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నాడు. ' ఈ డోపింగ్ వివాదం చాలా దురదృష్టకరం. ఈ అంశంపై దర్యాప్తు జరిపితేనే అసలు విషయ తెలుస్తుంది. నర్సింగ్పై నాకు నమ్మకం ఉంది. ఈ తరహా చర్యలకు నర్సింగ్ పాల్పడతాడని నేను అనుకోవడం లేదు' అని యోగేశ్వర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ యాదవ్ పాల్గొంటాడా లేదా అనే విషయం ‘నాడా’ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ సోమవారం స్సష్టం చేసిన సంగతి తెలిసిందే. నాడా క్లీన్ చిట్ ను బట్టే నర్సింగ్ రియో భవితవ్యం ఆధారపడి వుంటుందన్నాడు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, చట్టపరిధిలో ఉన్న ఒక సంఘంలో ఎవ్వరూ తలదూర్చే అవకాశం ఉండదన్నారు. దీంతో నర్సింగ్ కు అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లు కనబడుతోంది.ఒలింపిక్స్ కమిటీ ముందు నర్సింగ్ వాదనను బట్టే అతని రియో బెర్తు అవకాశాలు ఆధారపడివున్నాయి.