ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం మరోమారు వాయిదా పడింది. మొదట ప్రకటించినట్లుగా ఆగస్టు 14న కాకుండా 18న ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధికార ప్రతినిధి ఫైజల్ జావేద్ శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే భారత్ నుంచి ఇమ్రాన్ ఖాన్ స్నేహితులైన సునీల్ గావస్కర్, కపిల్‌దేవ్, నవజోత్‌సింగ్ సిద్ధూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపామని తెలిపారు. 1992 వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపినట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు.
కాగా, ఆగస్టు 13న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన నూతన సభ్యులు ప్రమాణం చేస్తారని పీటీఐ ఇన్ఫర్మేషన్ సెక్రటరీ ఫవాద్ ఛౌధురి తెలిపారు. అదేరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. సభలో తమకు 180 మంది సభ్యుల మద్దతు ఉందని ఫవాద్ చెప్తుండగా.. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పీటీఐని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కూటమిగా ఏర్పడిన పాకిస్తాన్ ముస్లింలీగ్ పార్టీ, (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తహిదా మజ్లిసే అమల్ పార్టీ నాయకులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో.. తాము ఆగస్టు 18న జరిగే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి పాకిస్తాన్‌కు వెళ్తున్నామని సునీల్ గావస్కర్, కపిల్‌దేవ్, నవజోత్‌సింగ్ సిద్ధూ మీడియాకు శనివారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment